పేదల జోలికొస్తే బీఆర్ఎస్ సైన్యం బుల్డోజర్లకు అడ్డు వస్తాం: కేటీఆర్ 

పేదల జోలికొస్తే బీఆర్ఎస్ సైన్యం బుల్డోజర్లకు అడ్డు వస్తాం: కేటీఆర్ 

హైదరాబాద్ నాగోల్ లో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వస్తే హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ సైన్యం బుల్డోజర్లకు అడ్డుపడతామని అన్నారు. గురువారం ( మార్చి 5 ) నాగోల్ లో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే విధ్యంసం చేయకుండా కూడా చేయవచ్చని చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో సుందరీకరణ చేసిన నాగోల్ సివేరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ భారతదేశంలో పెద్దదని అన్నారు. ఈ కార్యక్రమంతో మూసిని జీవనదిగా మార్చాలని కేసీఆర్ హయాంలో పునాది పడిందని అన్నారు. గతంలో చంద్రబాబు,వైఎస్ హయాంలో కూడా దీనిపై ఆలోచన చేసినా అది కార్యరూపం దాల్చలేదని అన్నారు కేటీఆర్. కేసీఆర్ హయాంలోనే మూసీ సుందరీకరణకు పునాది పడిందని.. ఇందులో భాగంగానే నాగోల్ సివరేజ్ ప్లాంట్ సుందరీకరణ చేశామని అన్నారు.

ఇలాంటివి 32 ప్లాంట్ లను ఏర్పాటు చేసి చాలా వరకు ప్రారంభించామని... మూసీలో 94శాతం వచ్చిన మురుగు నీటిని క్లీన్ చేయడం జరిగిందని..ఈ నీటిని నిర్మాణ రంగం,ల్యాండ్ స్కెపింగ్ కు వాడేలా చేశామని అన్నారు కేటీఆర్. కొండపోచమ్మ సాగర్ లో 15టీఎంసి సామర్ధ్యం గ్రావిటీ ద్వారా గండిపేట చెరువుకు నీళ్లు తెచ్చే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు కేటీఆర్.

11వేల కోట్ల నిధులతో గండిపేటకు నీళ్లు తెచ్చే విధంగా పని చేశామని అన్నారు. మూసీ మీద 15బ్రిడ్జి లు ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని... వాటికి శంకుస్థాపన కూడా చేశామని అన్నారు కేటీఆర్. 15బ్రిడ్జ్ ల కింద నీరు నిల్వ ఉంచి బోటింగ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశామని..ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా మూసీ ఒడ్డున వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేశామని అన్నారు కేటీఆర్.

ఇండ్లకు రెడ్ మార్కులు వేసి కష్టపడి కట్టుకున్న పేద ఇండ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. నిన్నకాక మొన్న ఖమ్మంలో ఎదో శత్రు దేశంపై యుద్ధం చేసినట్లు పేదల ఇండ్లను, గుడిసెలను కూల్చి రోడ్డున వేశారని అన్నారు. హైడ్రా పేరుతో అరాచకం చేస్తూ పేదలను సతాయిస్తున్నారని..గరీబోడు, పేదోడు ఇండ్లు కట్టుకుంటే ఇయాల అన్యాయంగా కూల్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. పేదల కన్నీటిని చూసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని అన్నారు.

ఆరు గ్యారెంటీల పేరుతో రంగుల కలలాంటి అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకుని ఇయాల ఇండ్లు కూల్చుతున్నారని అన్నారు. ఇయాల లక్షా యాభై వేల ఇళ్లలో పేదలు ఏ సమయంలో బుల్డోజర్ వస్తుందో అని భయం భయం తో రాత్రి పగలు గడుపుతున్నారని అన్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ  ఇచారు కేటీఆర్. మీరేమో మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు కానీ ప్రజలకు మూసి లూటీఫికేషన్ కనిపిస్తుందని అన్నారు కేటీఆర్. 

గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చుతున్న సమయంలో అక్రమం సక్రమం చేయాలికదా అని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అనాలోచన నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న బాధితుల వెంట మేము ఉన్నామని.. వారి జోలికి వస్తే మేము ఊరికే ఊకోమ్ కబర్దార్ అంటూ హెచ్చరించారు కేటీఆర్. కేసీఆర్ లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లను కడితే ఇయాల పెయింటర్ బాబు రేవంత్ రెడ్డి పెయింట్ వేస్తున్నాడని ఎద్దేవా చేశారు కేటీఆర్.