RamCharan-Sukumar: 'రంగస్థలం' మ్యాజిక్ రిపీట్: రామ్ చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్.. షూటింగ్ అప్‌డేట్ ఇదే!

RamCharan-Sukumar: 'రంగస్థలం' మ్యాజిక్ రిపీట్: రామ్ చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్.. షూటింగ్ అప్‌డేట్ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'రంగస్థలం'. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసి కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి చేతులు కలపబోతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  అటు మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2026 జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

స్క్రిప్ట్ వర్క్ లో సుకుమార్ జోరు

ప్రస్తుతం సుకుమార్ తన తదుపరి చిత్రం కోసం స్క్రిప్ట్ వర్క్‌ను ఇప్పటికే వేగవంతం చేశారు. తనదైన శైలిలో మల్టీ-లేయర్డ్ క్యారెక్టర్లు, ఎమోషనల్ డ్రామాతో కూడిన ఒక అద్భుతమైన కథను ఆయన సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా కోసం సుకుమార్ కోర్ టీమ్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. రామ్ చరణ్ కూడా కథా చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.

'పెద్ది' తర్వాతే సెట్స్ పైకి..

ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi)లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో కీలక పాత్రలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన వెంటనే, చరణ్ పూర్తి స్థాయిలో సుకుమార్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారు. జూలై 2026 నుంచి మొదలయ్యే ఈ షూటింగ్ సుమారు ఏడాది పాటు సాగనుంది.

అంచనాలు భారీగానే..

'రంగస్థలం' మూవీలో  చరణ్‌ను 'చిట్టిబాబు'గా కొత్త కోణంలో చూపించిన సుకుమార్..  ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎలాంటి పాత్రను డిజైన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో నిర్మించనుంది. సుకుమార్ సినిమాల్లో విజువల్స్ , మ్యూజిక్ టాప్ క్లాస్‌లో ఉంటాయి. ఈ సినిమా కోసం కూడా దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. బుచ్చిబాబుతో 'పెద్ది' తర్వాత సుకుమార్ సినిమా రానుండటం చరణ్ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలవనుంది. 'రంగస్థలం' మ్యాజిక్‌ను మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.