2026 నూతన సంవత్సరం ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత కొనసాగిస్తున్నాయి. జనవరి 2, శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త గరిష్టాలను తాకాయి. ప్రధానంగా ఆటోమొబైల్ కంపెనీల అద్భుతమైన సేల్స్ డేటా, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్లకు భారీగా ఊపునిచ్చాయి.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 26,328.55 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని నెలకొల్పింది. అలాగే మరో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 573.41 పాయింట్ల వృద్ధితో 85,762.01 వద్ద స్థిరపడింది. ఒక్క రోజే సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడటం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. అయితే మార్కెట్ల పరుగులకు వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆటో అమ్మకాల జోరు:
డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 25.8% వృద్ధి చెందడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. ముఖ్యంగా మారుతి సుజుకి, మహీంద్రా వంటి కంపెనీల షేర్లు తాజా డేటా వల్ల రాణించాయి.
2. బ్యాంక్ నిఫ్టీ రికార్డు:
బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా 60వేల మార్కును దాటి 60,152.35 వద్ద ఆల్‌టైమ్ హైని టచ్ చేసింది.
3.అమెరికా డీల్:
ఈ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టవచ్చని.. అలాగే అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. ఇవి ఇన్వెస్టర్లను కొలుగోళ్లకు దిగేలా ప్రేరేపించాయి.
4. గ్లోబల్ మార్కెట్ల మద్దతు:
ఆసియా మార్కెట్లైన దక్షిణ కొరియా, హాంకాంగ్, షాంఘై సానుకూలంగా ముగియడం, అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా లాభాల్లో ఉండటం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. ఇది ర్యాలీని కొత్త ఏడాది బలంగా ముందుకు తీసుకెళ్లటానికి సపోర్ట్ చేసిందని నిపుణులు చెబుతున్నారు.
5. దేశీయ సంస్థల కొనుగోళ్లు:
విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు పాల్పడుతున్నప్పటికీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లునిలకడగా కొనుగోళ్లు జరపడం మార్కెట్‌ను పతనం కాకుండా కాపాడింది.
ఇక చివరిగా నిఫ్టీ 50లో హిందాల్కో, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు సిగరెట్లపై పన్ను పెంపు నిర్ణయంతో ఐటీసీ షేరు దాదాపు 4 శాతం పడిపోయింది. అలాగే బజాజ్ ఆటో కూడా నష్టాలను చవిచూసింది. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి విలువ స్వల్పంగా బలపడి డాలర్‌తో పోలిస్తే 89.92 వద్ద నిలిచింది.
