న్యూఢిల్లీ: క్రూడ్ ఆయిల్ ధరలు కేవలం 15 రోజుల్లోనే 41 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 73 డాలర్లు ఉండగా, మార్చి 15 నాటికి 103 డాలర్లకి చేరింది. ఇది 41.1 శాతం లేదా 30 డాలర్ల పెరుగుదల. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఆయిల్ ఫీల్డ్‌లు, ఆయిల్ ట్యాంకర్లు దెబ్బతిన్నాయి. హార్మూజ్ జలసంధి మూతపడడంతో గ్లోబల్‌గా 20 శాతం ఆయిల్ సప్లయ్ ఆగిపోయింది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. ఆయిల్ మార్కెట్‌లో తీవ్ర వోలటాలిటీ కనిపిస్తోంది.
గ్యాస్ 90 శాతం అప్
గ్యాస్ ధరలు కూడా క్రూడ్ ఆయిల్‌లా గణనీయంగా పెరిగాయి. ఆసియా మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ధరలు ఫిబ్రవరి 27న మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ) కి 10–19 డాలర్ల రేంజ్‌లో ఉండగా, మార్చి 6 నాటికి 20–24 డాలర్ల రేంజ్‌కి పెరిగాయి. అంటే దాదాపు 80–90శాతం ఎగిశాయి. యూరప్ టీటీఎఫ్ హబ్ ధరలు 8–9 డాలర్ల నుంచి 15–16 డాలర్లకు అంటే 70–80 శాతం పెరిగాయి. అమెరికాలో హెన్రీ హబ్ ధరలు మాత్రం అధిక ఉత్పత్తి కారణంగా తక్కువగా ఉన్నాయి. ఎంఎంబీటీయూ ధర 2.85 డాలర్ల నుంచి 16 శాతం పెరిగి 3.3 డాలర్లకి చేరింది.
