కమనీయం శ్రీవారి కల్యాణం .. కనుల పండుగగా పాల్వంచ శ్రీనివాసగిరిపై వెంకన్నస్వామి పెళ్లి..

కమనీయం శ్రీవారి కల్యాణం .. కనుల పండుగగా పాల్వంచ శ్రీనివాసగిరిపై వెంకన్నస్వామి పెళ్లి..

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి (గుట్ట)పై ఆదివారం వెంకన్న స్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. ఈ వేడులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర 1600 మెట్లు ఎక్కి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా, తహసీల్దార్​ ధారా ప్రసాద్​ ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ శ్రీనివాసగిరిని ఎకో టూరిజం హబ్ గా మారుస్తామని, అటవీశాఖతో సమన్వయంతో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. గుట్ట పైకి భక్తులు వచ్చేందుకు అనువుగా రోడ్డు వేస్తామని మంత్రి తుమ్మల అన్నారు. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, బండి పార్థసారధి రెడ్డి కలిపి రూ.2 కోట్లు ఆలయ నిర్మాణానికి విరాళం ప్రకటించారు. 

కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్తగూడెం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ లలిత కుమారి, పలువురు కార్పొరేటర్లు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు, వనమా రాఘవేందర్​రావు, ఇతర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.