కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం తరచుగా వినే పదం 'జీరో డిప్రిసియేషన్'. దీనిని 'నిల్ డిప్' ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా కారు పాతబడే కొద్దీ దాని విడిభాగాల విలువ తగ్గుతూ ఉంటుంది. దీనినే తరుగుదల లేదా డిప్రిసియేషన్ అంటారు. ప్రమాదం జరిగినప్పుడు సాధారణ ఇన్సూరెన్స్ ఉంటే.. ఇన్సూరెన్స్ కంపెనీ ఈ తరుగుదలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంది. కానీ జీరో డిప్రిసియేషన్ కవర్ ఉంటే.. తరుగుదలతో సంబంధం లేకుండా మరమ్మత్తు ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ పూర్తిగా భరిస్తుంది.
ఉదాహరణకు మీ వద్ద ఒక కారు ఉందనుకుందాం. ఒకవేళ దానికి ప్రమాదం జరిగి ప్లాస్టిక్ లేదా ఫైబర్ విడిభాగాలను మార్చాల్సి వచ్చింది అనుకుందాం. వాటి ఖరీదు రూ.20వేలు అనుకుంటే. ఈ సందర్భంలో మీ వద్ద సాధారణ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే.. ప్లాస్టిక్ భాగాలపై 50% తరుగుదల వర్తిస్తుంది. అంటే కంపెనీ రూ.10వేలు మాత్రమే ఇస్తుంది కంపెనీ. మిగిలిన రూ.10వేలను మీరు మీ జేబులో నుండి భరించాల్సి ఉంటుంది. అదే మీ దగ్గర జీరో డిప్రిసియేషన్ పాలసీ ఉన్నట్లయితే.. పార్ట్ కాస్ట్ మెుత్తం రూ.20వేలను ఇన్సూరెన్స్ కంపెనీయే చెల్లిస్తుంది. మీరు కేవలం ఫైల్ ఛార్జీలు మాత్రమే కట్టాల్సి ఉంటుందన్నమాట.
ఈ రకమైన ఇన్సూరెన్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త కారు కొన్నవారికి ఇది ఒక వరం లాంటిది. ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో మీపై ఆర్థిక భారం దాదాపు సున్నా అవుతుంది. ప్లాస్టిక్, రబ్బరు, గ్లాస్, ఫైబర్ వంటి భాగాలకు 100% రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది ఈ జీరో డిప్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం వల్ల. సాధారణ పాలసీ కంటే దీని ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. క్లెయిమ్ సమయంలో వచ్చే ప్రయోజనం ముందు ఆ ఖర్చు చాలా తక్కువని చెప్పుకోవచ్చు.
సాధారణంగా కొత్త కార్లకు లేదా 5 ఏళ్ల లోపు వయస్సు ఉన్న కార్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసేటప్పుడు కొంచెం అదనపు ప్రీమియం చెల్లించి ఈ 'యాడ్-ఆన్' కవర్‌ను పొందవచ్చు. మొదటిసారి కారు నడుపుతున్న వారికి, ఖరీదైన కార్లు ఉన్నవారికి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న రద్దీ ప్రాంతాల్లో రోజూ డ్రైవింగ్ చేసే కారు యజమానులకు జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ సూపర్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
