ట్రంప్ సర్కార్‌కు షాక్.. ముందు అక్రమ టారిఫ్ డబ్బు రీఫండ్ చేయాలన్న న్యూయార్క్ కోర్టు

ట్రంప్ సర్కార్‌కు షాక్.. ముందు అక్రమ టారిఫ్ డబ్బు రీఫండ్ చేయాలన్న న్యూయార్క్ కోర్టు

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానాలు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. అక్రమంగా టారిఫ్స్ విధించి వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ట్రంప్ యంత్రాంగానికి కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు.

కోర్టు మొట్టికాయలు:
గతేడాది 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(IEEPA) కింద ట్రంప్ ఏకపక్షంగా భారీ దిగుమతి పన్నులను విధించారు ప్రపంచ దేశాలపై. అయితే పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడు తనంతట తానుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ విధించిన ఈ పన్నులు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఫిబ్రవరి నెలలోనే ఆయన నిర్ణయాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

రీఫండ్‌పై కోర్టు సీరియస్:
సుప్రీం కోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని.. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు జడ్జి రిచర్డ్ ఈటన్ కీలక తీర్పు ఇచ్చారు. పన్నుల రూపంలో అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని దిగుమతిదారులకు తిరిగి రీఫండ్ చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని రికార్డుల్లో ఉన్న దిగుమతిదారులు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా లబ్ధి పొందడానికి అర్హమైనవిగా ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక కంపెనీకే కాకుండా.. పన్నులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఈ నిధులు వెళ్లాలని కోర్టు పేర్కొంది.

రూ.14 లక్షల కోట్లకు పైగా భారం:
పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ లెక్కల ప్రకారం.. అమెరికా ప్రభుత్వం డిసెంబర్ మధ్య నాటికి దాదాపు 130 బిలియన్ డాలర్ల పన్నులను వసూలు చేసింది. ఇప్పుడు రీఫండ్ల రూపంలో ప్రభుత్వం దాదాపు 175 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.14.5 లక్షల కోట్లు చెల్లించాల్సి రావచ్చని తేలింది. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం అమెరికా ఖజానాపై పెద్ద భారంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం:
కస్టమ్స్ విభాగం వెంటనే ఈ పన్నుల వసూళ్లను నిలిపివేయాలని, పాత బకాయిలను తిరిగి లెక్కగట్టి రీఫండ్ ప్రక్రియను ప్రారంభించాలని జడ్జి ఆదేశించారు. ప్రభుత్వం ఈ ప్రక్రియను ఆలస్యం చేయాలని చూసినా.. అప్పిలేట్ కోర్టులు కూడా ట్రంప్ విజ్ఞప్తిని తోసిపుచ్చాయి. కస్టమ్స్ వ్యవస్థలో ఇంత పెద్ద మొత్తంలో రీఫండ్లు చేయడం సాంకేతికంగా సవాలే అయినప్పటికీ, న్యాయస్థానం మాత్రం వినియోగదారులకు, కంపెనీలకు న్యాయం జరగాలని గట్టిగా నిలబడింది.

ఈ తీర్పుతో ట్రంప్ హయాంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఎంతటి అస్తవ్యస్తంగా ఉన్నాయో మరోసారి బయటపడింది. కానీ ట్రంప్ మాత్రం ఈ చట్టాలు కాకుంటే ఇంకో చట్టం కింద ప్రపంచ దేశాల నుంచి టారిఫ్స్ వసూలు చేస్తానంటూ బెదిరించటం కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకపోవటం చర్చనీయాంశంగా మారుతోంది. మెుత్తానికి అక్రమంగా టారిఫ్స్ తో అమెరికాను తిరిగి సంపన్న దేశంగా నిర్మించాలనుకుంటున్న ట్రంప్ కలలకు న్యాయస్థానం బ్రేక్ వేసిందనే చెప్పుకోవచ్చు.