టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నాగచైతన్య తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రయోగాత్మక పంథాలో సాగుతున్నారు. 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో టాలీవుడ్‌ను వణికించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు, చైతన్యతో కలిసి రూపొందిస్తున్న సరికొత్త సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, అంచనాలను ఆకాశానికి చేర్చింది.
విధి రాసిన వింత కావ్యం..
"అతీంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు.. సృష్టి ధర్మం తప్పినప్పుడు.. విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది" అంటూ వినిపించే పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన గ్లింప్స్, ప్రేక్షకులను ఒక మర్మమైన లోకంలోకి తీసుకెళ్లింది. ఇందులో నాగచైతన్య లుక్ చూస్తుంటే, ఆయన కెరీర్ లోనే ఇది అత్యంత ఇంటెన్స్ రోల్ అని అర్థమవుతోంది. గత చిత్రాల్లోని సాఫ్ట్ ఇమేజ్ ను పక్కన పెట్టి, ఒక గంభీరమైన, భయానక వాతావరణంలో చిక్కుకున్న యోధుడిగా చైతూ కనిపించిన తీరు అమోఘంగా ఉందని టాక్ వినిపిస్తోంది.
మిస్టీరియస్ మూడ్ లో..
ఈ గ్లింప్స్‌కు ప్రధాన బలం అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం. ప్రతి సెకను గుండె చప్పుడు పెంచేలా, ఆ మిస్టీరియస్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో ఆయన మ్యూజిక్ ప్రాణం పోసింది. విజువల్స్ విషయానికొస్తే, గ్రామీణ నేపథ్యంలో జరిగే క్షుద్ర శక్తుల పోరాటం, మర్మమైన ఆచారాలు, అర్థం కాని శబ్దాలతో సినిమా హారర్ థ్రిల్లర్ ప్రియులకు కనువిందు చేయనుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ , ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కథా నేపథ్యం..
సాధారణంగా కార్తీక్ దండు సినిమాల్లో మూఢనమ్మకాలు, సైన్స్, పురాణ గాథల మేళవింపు ఉంటుంది. 'వృషకర్మ' అంటే సంస్కృతంలో 'ఎద్దు వంటి పట్టుదల గల పని' లేదా 'శక్తివంతమైన కార్యసాధకుడు' అని అర్థం వస్తుంది. సమాజంలో చెలరేగుతున్న అతీంద్రియ శక్తులను అడ్డుకోవడానికి ప్రకృతి ఎంచుకున్న ఒక సామాన్యుడి అసాధారణ ప్రయాణమే ఈ సినిమా అని టాక్ వినిపిస్తోంది.ఈ మూవీలో నాగచైతన్య సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తోంది. వెటరన్ యాక్టర్ జయరామ్, 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ, కమెడియన్ సత్య ఈ కథలో కీలక మలుపులు తిప్పే పాత్రల్లో కనిపించనున్నారు.
నాగచైతన్య ఇప్పటివరకు లవ్ స్టోరీస్, యాక్షన్ డ్రామాలు చేశారు కానీ, పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ జోనర్ చేయడం ఇదే మొదటిసారి. గ్లింప్స్‌తోనే భయపెట్టేసిన 'వృషకర్మ', బాక్సాఫీస్ వద్ద చైతూకి ఒక మైలురాయి లాంటి హిట్ ఇస్తుందని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
