- ఇన్ సర్వీస్ టీచర్లకు సీబీటీపై అవగాహన..
- నవంబర్ 5వ తేదీ నుంచి టెట్ మాక్ టెస్టులు
- ప్రాక్టీస్ సెంటర్లుగా జిల్లాకు 5 స్కూళ్ల ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఏండ్ల తరబడి చాక్‌పీస్‌తో పాఠాలు చెప్పిన సీనియర్ టీచర్లు ఇన్‌సర్వీస్ టెట్ రాయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఉన్నతాధికారులు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మాక్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. గత నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన టెట్‌కు 24,986 మంది దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో 15,749 మంది (70.07%) ఉత్తీర్ణులయ్యారు. మిగిలినవారు ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలో నవంబర్ 16 నుంచి 21 వరకు స్పెషల్ టీజీ టెట్-2 నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొత్తం 9,262 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-1కు 1,267 మంది, పేపర్-2కు 6,671 మంది, రెండు పేపర్లకు 1,324 మంది అప్లై చేసుకున్నారు.
సర్వీసులో ఉన్న టీచర్లలో చాలా మందికి ఆన్లైన్ పరీక్షలు కొత్త కావడంతో మౌస్ ఆపరేషన్, టైమర్‌ను గమనించడం, స్క్రీన్‌పై ప్రశ్నలను మార్చడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో టెట్‌ను గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని పలు టీచర్ల సంఘాలు విద్యాశాఖను కోరాయి. అయితే పరీక్ష విధానాన్ని మార్చడం సాధ్యం కాదని, సీబీటీలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో మాక్ టెస్టుల ద్వారా టీచర్లకు పరీక్ష విధానంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. నవంబర్ 5 నుంచి 10 వరకు మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.inలో లింక్ ఉంచనున్నారు.
స్పెషల్ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న టీచర్లు వెబ్సైట్ ద్వారా లేదా జిల్లాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రాల్లో మాక్ టెస్టులు రాయవచ్చు. ప్రధాన పరీక్షలు నవంబర్ 16 నుంచి 21 వరకు జరగనున్నందున, అంతకుముందే ప్రాక్టీస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి జిల్లాలో ఐదు స్కూళ్ల చొప్పున, ఒక్కో కేంద్రంలో కనీసం 20 కంప్యూటర్లతో ఏర్పాట్లు చేస్తున్నారు.
వీటిని సంబంధిత డీఈవోలు పర్యవేక్షించనున్నారు. టీచర్లకు సాంకేతిక సహాయం అందించేందుకు కేంద్రాల్లో ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఎంపిక చేసిన స్కూళ్లు, ఇన్‌స్ట్రక్టర్ల వివరాలను నిర్ణీత గూగుల్ ఫామ్ ద్వారా ఈ నెల 31లోగా ప్రభుత్వానికి సమర్పించాలని డీఈవోలను ఆదేశించారు.
