- ధరల పెంపుతో జనం వెనకడుగు
- దీపావళికీ అమ్మకాలు పెరిగే అవకాశాలు తక్కువే
- గిరాకీ లేక వ్యాపారుల టెన్షన్
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో ఐఫోన్ కొనేందుకు కస్టమర్లు ఎగబడుతుంటారు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దసరా పండుగ సమయంలో ఐఫోన్ అమ్మకాలు 30 శాతం వరకు తగ్గాయి. గతంలో కొత్త మోడల్ రాగానే పాత ఫోన్ల ధరలు తగ్గేవి.
ఈసారి యాపిల్ సంస్థ పాత మోడళ్లతో పాటు కొత్తగా వచ్చిన ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలను కూడా భారీగా పెంచింది. దీనికి తోడు పండుగ ఆఫర్లు, ఫైనాన్సింగ్ డిస్కౌంట్లు ఆకర్షణీయంగా లేవు.
ఎల్ నినో వల్ల దేశమంతటా కరువు కమ్ముకొస్తోంది. జనం లగ్జరీ ప్రొడక్టులకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లకు డిమాండ్ అమాంతం పడిపోయింది. కస్టమర్లు ఆచితూచి ఖర్చు చేస్తుండటంతో దసరా సమయంలో అమ్మకాలు 30 శాతం వరకు తగ్గాయ ని ఐడీసీ నివేదిక వెల్లడించింది. దీపావళికి కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు.
వాయిదా పడుతున్న కొనుగోళ్లు
ప్రతి ఏటా సెప్టెంబర్‌లో వచ్చే బేస్ మోడల్ ఐఫోన్ 18 ఈసారి రాలేదు. ఇది 2027లో వచ్చే అవకాశం ఉండటంతో చాలామంది అప్పటి దాకా కొత్త ఫోన్ కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న పాత ఫోన్లు ఇంకా బాగానే పనిచేస్తుండటం కూడా ఇందుకు ఒక కారణం. పండుగ సీజన్ కోసం పెద్ద ఎత్తున స్టాక్ తెప్పించుకున్న రిటైలర్లు ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో తీవ్ర అందోళన చెందుతున్నారు.
డిమాండ్ ఉన్నా దొరకని డ్యుయో
సాధారణ ఐఫోన్ల పరిస్థితి ఇలా ఉంటే, కొత్తగా వచ్చిన ఐఫోన్ డ్యుయో కోసం విపరీతమైన పోటీ ఉంది. రూ. మూడు లక్షల ప్రారంభ ధర ఉన్న ఈ ఫోన్ కోసం రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకు అదనంగా ప్రీమియం చెల్లించేందుకు కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ.. భారత్‌లో కేవలం 6000 నుంచి 7000 ఫోన్లు మాత్రమే సరఫరా అయ్యాయి. వంద ఫోన్లు వస్తాయని ఆశించిన వ్యాపారులకు కేవలం 5 నుంచి 7 యూనిట్లు మాత్రమే దక్కాయి. ఈ కొరతను ఆసరాగా చేసుకుని దుబాయ్ నుంచి గ్రే మార్కెట్ ద్వారా ఈ ఫోన్లు దిగుమతి అవుతున్నాయి.
అయినప్పటికీ మార్కెట్లో యాపిల్ స్థానం సురక్షితంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 27 శాతం వాటాతో యాపిల్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఆ క్వార్టర్లో 39 లక్షల ఫోన్లను మార్కెట్లోకి పంపించగలిగింది. బ్రాండ్‌పై జనానికి ఆసక్తి తగ్గిందని ఇప్పుడే చెప్పలేమన్నది ఎక్స్పర్టుల మాట.
