పణజీ: పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రస్తుతమున్న 20 శాతానికి మించి పెంచే ఆలోచన లేదని కేంద్ర చమురు, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. దక్షిణ గోవాలో జరిగిన 29వ ఎనర్జీ టెక్నాలజీ, ఇన్నోవేషన్ మీట్‌లో ఆయన మాట్లాడారు.
ఈ–20 ఇంధనం గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికే ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. ఈ–20 వాడకం వల్ల కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1.60 లక్షల కోట్లు ఆదా చేసిందని, అందులో రూ.1.40 లక్షల కోట్లను రైతులకే తిరిగి ఇచ్చామని వివరించారు.
పాత వాహనాల్లో మాత్రమే ఈ ఇంధనంతో సమస్యలు వస్తున్నాయని, కొత్తవి ఈ–20కి అనుకూలంగానే తయారయ్యాయని పూరి స్పష్టం చేశారు.
