కొత్త సంవత్సరం వేళ భారతీయ ఆటోమొబైల్ రంగంలో కియా ఇండియా భారీ సంచలనం సృష్టించింది. తన మోస్ట్ పాపులర్ మోడల్ 'సెల్టోస్'లో సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. అధునాతన హంగులు, గ్లోబల్ ప్లాట్‌ఫారమ్, స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ ఎస్‌యూవీ గురించి ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
కొత్త కియా సెల్టోస్ 2026 బేస్ వేరియంట్ రూ.10లక్షల 99 వేల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. టాప్- మోడల్ ధర రూ.19లక్షల 99 వేల వరకు ఉంది. ఈ కారును ప్రధానంగా నాలుగు కోర్ ట్రిమ్స్‌లో (HTE, HTK, HTX, GTX/X-Line) కియా ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఆప్షన్ ప్యాక్స్‌ను కూడా ఇందులో చేర్చారు.
ఈ సెకండ్ జనరేషన్ సెల్టోస్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కియా గ్లోబల్ K3 ప్లాట్‌ఫారమ్ పై నిర్మించటమే. భారత్‌లో ఈ ప్లాట్‌ఫారమ్‌పై వస్తున్న తొలి మోడల్ ఇదే. దీని వల్ల కారు బాడీ మరింత దృఢంగా ఉండటమే కాకుండా.. ప్రయాణంలో కుదుపులు తక్కువగా ఉండి మంచి స్టెబిలిటీని ఇస్తుంది. పాత మోడల్ కంటే ఇది 4,460 మి.మీ పొడవు, 1,830 మి.మీ వెడల్పుతో పెద్దదిగా కనిపిస్తుంది.
లోపలి భాగంలో లార్జ్ పానోరమిక్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అనుసంధానించారు. ప్రీమియం బోస్ ఆడియో, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వెలుతురుకు తగ్గట్టుగా పనిచేసే ఆటోమేటిక్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఇక భద్రత విషయానికొస్తే.. లెవల్-2 ADAS టెక్నాలజీ ద్వారా 21 అటానమస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ABS వంటివి అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తోంది కియా సంస్థ.
డ్రైవింగ్ ప్రియుల కోసం కియా మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది..
* 1.5-లీటర్ పెట్రోల్: సిటీ డ్రైవింగ్‌కు అనువైనది.
* 1.5-లీటర్ టర్బో-పెట్రోల్: శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేది.
* 1.5-లీటర్ డీజిల్: ఎక్కువ మైలేజీ కోరుకునే వారి కోసం.
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా సెల్టోస్ ప్రధానంగా హ్యుందాయ్ క్రెటా, కొత్తగా లాంచ్ అయిన టాటా సియెర్రాలతో పోటీ పడనుంది. వీటితో పాటు మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్ వంటి కార్ల మార్కెట్‌కు కూడా సెల్టోస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన ధర, హై-టెక్ ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త సెల్టోస్ కియా ఇండియా అమ్మకాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆటో నిపుణులు అంటున్నారు. చూడాలి కియాకు ఈ మోడల్ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో కొత్త ఏడాదిలో.
