వేసవి భానుడు భగ భగ మండిపోతున్నాడు. మార్చి మొదటి వారంలోనే మద్యాహ్నం అయిందంటే జనాలు రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. మొన్నటి వరకు చలికి వణికిపోయిన జనాలు ఇప్పుడు ఎండతో ఇబ్బంది. పడుతున్నారు. అయితే ఎండలతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది వేసవి. ఆస్తమా, ఊపిరితిత్తులు, చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. వాటినుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. .
అతిసార : ఎక్కువగా పిల్లలకు వచ్చే వ్యాధి ఇది. వేసవిలో ఎండ పెరగడంతో దాహం వేస్తుంది. అలాంటప్పుడు ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగుతారు. ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి దాడి చేస్తుంది. దాంతో అతిసారవస్తుంది. రోజులో మూడు కంటే ఎక్కువ సార్లు నీళ్ల విరోచనాలు అవుతాయి. మూత్ర విసర్జన తగ్గిపోతుంది.. నీరసించిపోతారు. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే ఎప్పుడు బయటకెళ్లినా మంచినీళ్ల బాటిల్ ను వెంట తీసుకెళ్లాలి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు. ఎప్పుడూ శుభ్రంగా ఉన్న ఆహారాన్నే తినాలి.
వేడి జలుబు: వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్ ఫ్లుయెంజా లాంటి వైరస్ లు సోకుతాయి. ఇవి చలికాలంలో వైరస్ కన్నా ప్రమాదకరమైనవి. వీటి వల్ల జలుబు దగ్గు, తలనొప్పి, శ్వాస సంబందిత సమస్యలు వస్తాయి. వేడి జలుబుతో పాటు గొంతులో ముక్కులో శ్లేష్మంలో మంటగా ఉంటుంది. అయితే స్మిమ్మింగ్ పూల్స్, ఏసీల వల్ల ఈ వైరస్ లు విస్తరించే ప్రమాదం ఎక్కువ పరిశుభ్రత. పాటిస్తే ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
స్విమ్మర్స్ ఇయర్ డిసీజ్ : ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది స్విమ్మింగ్ చేస్తుంటారు. లేదంటే షవర్ బాత్ చేస్తుంటారు. కొందరైతే చాలాసేపు నీళ్లలోనే ఉంటారు. ఇలాంటప్పుడు చెవుల్లో నీళ్లు నిలుస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్నే స్విమ్మర్స్ ఇయర్ డిసీజ్ గా పిలుస్తారు. అయితే ఈ సమస్య రాకుండా ఉండేందుకు కొందరు చెవిలో దూది పెట్టుకుని స్విమ్మింగ్ చేస్తుంటారు. కానీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. స్విమ్మింగ్ చేసిన తరువాత కాటన్ టవల్ లేదా ఇయర్ బడ్స్ తో చెవి లోపలి భాగాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
