అమెరికా అగ్ర నాయకులను చంపడానికి ఇరాన్ గూఢచారులు తనను వాడుకున్నారని ఆసిఫ్ మర్చంట్ (47) అనే పాకిస్థాన్ వ్యక్తి కోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ సహా నిక్కీ హేలీలను చంపడానికి తనకు ప్లాన్ ఇచ్చారని తెలిపాడు.
బుధవారం అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టులో జరిగిన విచారణలో ఆసిఫ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. నాకు వేరే దారి లేదు.. నా భార్యా, పిల్లలను చంపేస్తామని ఇరాన్ గూఢచారులు బెదిరించారు. వాళ్ల ప్రాణాలు కాపాడుకోవడానికే నేను ఈ పనికి ఒప్పుకున్నాను అని జ్యూరీ సభ్యులకు వివరించాడు.
అసలేం జరిగిందంటే... ఆసిఫ్ మర్చంట్ ఒక మాజీ బ్యాంకర్. ఏప్రిల్ 2024లో మెహర్దాద్ యూసఫ్ అనే ఇరాన్ వ్యక్తి ఇతనికి పరిచయమయ్యాడు. అమెరికా వెళ్లి ముఖ్యమైన వ్యక్తులను అంతం చేయాలని ఆసిఫ్‌ను ఇరాన్ గూఢచారులు అమెరికాకు పంపారు. ఇందుకోసం ఆసిఫ్ ఇద్దరు కిరాయి హంతకులను నియమించుకున్నాడు. వారికి అడ్వాన్స్‌గా 5,000 డాలర్లు అంటే సుమారు రూ. 4.6 లక్షలు ఆఫర్ చేశాడు. కానీ, అతను కిరాయి హంతకులు అనుకుని కలిసిన వ్యక్తులు అసలైన FBI (అమెరికా నిఘా సంస్థ) ఏజెంట్లు. దీంతో ఆసిఫ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
విచిత్రం ఏంటంటే.. తక్కువ డబ్బు ఇస్తే ఎవరూ హత్యలు చేయరని ఆసిఫ్‌కు ముందే తెలుసట. అతను ఎలాగోలా దొరికిపోతానని, అప్పుడు అమెరికా పోలీసులకు నిజం చెప్పేస్తే తనకు అమెరికాలో శాశ్వతంగా ఉండడానికి గ్రీన్ కార్డ్ ఇస్తారని అతను ఆశపడినట్లు కోర్టులో చెప్పాడు.
క్వీన్స్‌లోని ఒక హోటల్‌లో ఆసిఫ్ హంతకులతో (FBI ఏజెంట్లతో) మాట్లాడుతున్న దృశ్యాలను పోలీసులు కోర్టులో ప్రదర్శించారు. అందులో ట్రంప్ ఎలా చనిపోతాడు? ఇదీ మన టార్గెట్ అని ఆసిఫ్ మాట్లాడుతున్న మాటలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఒకవేళ నేరం రుజువైతే ఆసిఫ్ మర్చంట్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
