ధరల పెరుగుదల, కరెన్సీ పతనం ఇరాన్ ను కుదిపేస్తున్నాయి..వారం రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు.. మొదట వ్యాపారులు.. ఇప్పుడు విద్యార్థులు.. దేశవ్యాప్తంగా పాకిన నిరసనలు.. యూనివర్సిటీలు వదిలి రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు. అణిచివేసేందుకు సైనిక చర్యలు.. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం ఇరాన్ లో ప్రస్తుత పరిస్థితి.ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా.. మా దేశ భద్రత విషయంలో ట్రంప్ జోక్యం చేసుకుంటే పరిణామాలు వేరే ఉంటాయని హెచ్చరిస్తోంది ఇరాన్.
ఇరాన్ లో రోజురోజుకు భారం అవుతున్న ధరలు, పెరుగుతు ద్రవ్యోల్బణం, నానాటికి పడిపోతున్న కరెన్సీ.. అక్కడిప్రజల్లో ఆందోళన కలిగించాయి. దీంతో మొదట వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. శని, ఆదివారాల్లో షాపులు బంద్ చేసి నిరసనలు చేపట్టారు. తాజాగా స్టూడెంట్లు కూడా ఆందోళన బాట పట్టారు.
ఇరాన్ లోని ప్రధాన యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. మొత్తం పది యూనివర్సీటీల్లో విద్యార్థి ఆందోళనలు ఉదృతం చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని దాదాపు ఏడు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారు.
వ్యాపారులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొనడం అక్కడి ప్రభుత్వం ఆందోళన కారులను కట్టడి చేసేందుకు సైనిక చర్యకు దిగింది.. యూనివర్సిటీల చుట్టూ ఆర్మీ బలగాలుమోహరించాయి. నిరసనలను అదుపు చేసే క్రమంలో ముగ్గురు మృతిచెందారు. ఆందోళనలు దేశం మొత్తం వ్యాపించాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు.
ఇరాన్ లో పరిస్థితి అదుపులోకి రాకపోతే.. ఇలాగే ఆందోళనకారులను కాల్చి చంపితే చూస్తూ ఊరుకోమంటూ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. తమ సైన్యం ఇరాన్ కు వచ్చేందుకు సిద్దం గా ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాజా వరకు అమెరికా రక్షణ చరిత్ర ను ఇరాన్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారికి ఆ చరిత్ర బాగా తెలుసు.. సాకులతో ఇప్పుడు ఇరాన్ భద్రత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవాలని చూస్తోంది.. అలా జరిగితే ప్రశ్చాత్తాప పడే పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుంది..ఇరాన్ జాతీయ భద్రత ఓ రెడ్ లైన్.. ఇది సాహసోపేతమైన ట్వీట్లకు సంబంధించిన విషయం కాదు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను హెచ్చరించారు.
ఇరాన్ లో ధరల పెరుగుదల , ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి నిరసనలు తారాస్థాయికి చేరి ఉద్రిక్తత పెరుగుతున్న క్రమంలో ట్రంప్, ఇరాన్ పరస్పర హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి.
మరోవైపు బాహ్య శక్తులు అశాంతికి ఆజ్యం పోస్తున్నాయని ఇరాన్ అధికారులు ఆరోపించారు. అమెరికా ,ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇరాన్ లో అల్లర్లను రెచ్చగొడుతున్నాయని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజాని X లో ఆరోపించారు.అమెరికా జోక్యం మొత్తం ప్రాంతంలో గందరగోళానికి దారితీస్తుందని హెచ్చరించారు.
