తిరుమలలో ఏఐ టెక్నాలజీతో సేవలు ప్రశంసనీయం : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తిరుమలలో ఏఐ టెక్నాలజీతో సేవలు ప్రశంసనీయం : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.శుక్రవారం (జూన్5) పీయూష్ గోయల్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఈవో రవిచంద్ర ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పనితీరును ప్రశంసించారు. ఈ వ్యవస్థ ద్వారా గదుల లభ్యత, భక్తుల రాకపోకలు, క్యూ లైన్ల పరిస్థితి, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి వివరాలు తక్షణమే పర్యవేక్షించగలుగుతున్నాయన్నారు. ఏఐ వాడకంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లను ఆయన అభినందించారు. కేవలం 100 రోజులలోనే ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం టీటీడీ అధికారుల సమర్థతకు నిదర్శనమన్నారు మంత్రి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. తన తల్లి పేరుతో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో మొక్క నాటి దాన్ని సంరక్షించాలని మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.