రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' . గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన 'తబాహీ' పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అంతే కాదు వివాదాలను కూడా మూటగట్టకుంది. ఇప్పుడు మేకర్స్ రెండో సాంగ్ 'మధోష్' ను విడుదల చేసి మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఈ పాటలో యష్ పోషిస్తున్న రాయా పాత్ర, తారా సుతారియా నటిస్తున్న రెబెక్కా మధ్య ప్రేమ, ఆవేదన, అనురాగం, చెప్పలేని భావోద్వేగాలను ఎంతో అందంగా ఆవిష్కరించారు. 'తబాహీ'లో కనిపించిన ఉత్సాహభరితమైన రొమాన్స్‌కు పూర్తి భిన్నంగా.. 'మనసాగదే'లో ప్రేమలోని నిశ్శబ్ద భావాలు, విడదీయలేని అనుబంధం, అంతర్లీన వేదన ప్రధానంగా కనిపిస్తాయి. రాయా పాత్రలో యష్ స్టైలిష్‌గా కనిపించడం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తారా సుతారియాతో ఆయన కెమిస్ట్రీ విజువల్‌గా అద్భుతంగా మెప్పిస్తోంది.
ఈ మెలోడీని తనిష్క్ బాగ్చి, అర్సలాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరచగా, అన్ని భాషల్లో సిద్ధార్థ్ బస్రూర్ తన గాత్రంతో భావోద్వేగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. తెలుగులో ఈ పాటకు ప్రముఖ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కన్నడలో 'మనమోహక', తమిళంలో 'తడుమారుదేయ్', మలయాళంలో 'మధుమోహిని', హిందీలో 'మధోష్' పేర్లతో ఈ గీతాన్ని విడుదల చేశారు.
దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ , కేవీఎన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ రైడ్‌గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
