సోనమ్ వాంగ్‌చుక్‌కు బిగ్ రిలీఫ్.. మెదాంత ఆసుపత్రికి తరలించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సోనమ్ వాంగ్‌చుక్‌కు బిగ్ రిలీఫ్.. మెదాంత ఆసుపత్రికి తరలించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‎కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్‏కు భారీ ఊరట దక్కింది. సప్ధర్ జంగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాంగ్ చుక్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయనను ఢిల్లీలోని  మెదాంత ఆసుపత్రికి తరలించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. 

నీట్ 2026 పేపర్ లీక్‎, విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసన కార్యక్రమానికి మద్దతుగా సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 

దీంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, తన భర్తను సఫ్దర్ జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం (జులై 21) ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వాంగ్ చుక్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అతడిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి నుంచి ఢిల్లీలోని మెదాంత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇచ్చింది.

 అలాగే, ఇప్పటి వరకు వాంగ్ చుక్‏కు చేసిన ట్రీట్మెంట్ వివరాలు, ఇతర రిపోర్ట్స్ అన్ని మెదాంత ఆసుపత్రికి అందజేయాలని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ వైద్యులను కోర్టు ఆదేశించింది. వాంగ్‌చుక్‌కు చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు మెదాంత ఆసుపత్రికి సూచించింది.

ALSO READ : విద్యార్థులపై లాఠీఛార్జీ సరికాదు..

కేంద్ర ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వాంగ్‌చుక్‌ను మెదాంత ఆసుపత్రికి తరలించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలియజేశారు. అయితే, వైద్య సలహాకు విరుద్ధంగా వాంగ్‌చుక్‌ను డిశ్చార్జ్ చేయకుండా చూడాలని కోర్టును కోరారు. వాంగ్ చుక్ చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఒకవేళ అతను నిరసన ప్రదేశానికి తిరిగి వెళితే అతని ఆరోగ్యం మరింత క్షీణించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.