ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక గ్రాఫిక్ పిక్చర్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటో తెలుసా? 2000 సంవత్సరంలో మన దేశంలో ధరలు ఎలా ఉండేవి.. ఇప్పుడు 2026లో ఎలా ఉన్నాయి అనే కంపారిజన్. ఇది చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. అవునా.. అప్పట్లో ఇంత తక్కువ ధరలకే ఇవన్నీ వచ్చాయా అంటూ అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటే.. నేటి తరం మాత్రం ఈ ధరలు చూసి షాక్‌కు గురవుతోంది. గడిచిన 25 ఏళ్లలో సామాన్యుడి జీవన వ్యయం ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ఈ వైరల్ పోస్ట్ కళ్లకు కడుతోంది.
2000లో లీటర్ పెట్రోల్ కేవలం 26 రూపాయలకే దొరికేదట. అది 2026 నాటికి చాలా నగరాల్లో దీని ధర 102 రూపాయల మార్కును తాకింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, రవాణా ఖర్చులు తోడవ్వడంతో పెట్రోల్ సామాన్యుడికి గుదిబండగా మారింది.
ఇక వంటింట్లో వాడే గ్యాస్ సిలిండర్ కథ సరేసరి. 2000లో కేవలం రూ.157కే దొరికిన డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ 2026లో రూ. 912 కు చేరింది. ప్రభుత్వం ఎన్నో సబ్సిడీలు, పాలసీలు మార్చినప్పటికీ.. మధ్యతరగతి నెలవారీ బడ్జెట్‌ను శాసిస్తున్న ప్రధాన ఖర్చుల్లో గ్యాస్ సిలిండర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక ఇండియన్ ఫ్యామిలీస్ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అత్యంత అవసరమైన వస్తువు పాలు. బ్రాండ్, ఫ్యాట్ కంటెంట్‌ను బట్టి ధరలు మారినప్పటికీ.. ఆనాడు లీటర్ పాలు సగటున 14 రూపాయలు ఉంటే.. ప్రస్తుతం ఏకంగా 72 రూపాయలకు చేరింది. పశువుల మేత ఖర్చులు, ప్యాకేజింగ్, రవాణా ఛార్జీలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది దేశంలోని ఆహార ద్రవ్యోల్బణ తీవ్రతకు అద్దం పడుతోంది.
ట్విస్ట్ ఏంటంటే.. సోషల్ మీడియాలో కేవలం ఈ మూడు వస్తువుల ధరలనే చూపిస్తున్నప్పటికీ.. నిజమైన జీవన వ్యయం అనేది కేవలం పెట్రోల్, పాలతోనే ముగిసిపోదు. గత 26 ఏళ్లలో ఇళ్ల అద్దెలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, కరెంట్ బిల్లులు, ఎంటర్టైన్‌మెంట్.. ఇలా ప్రతి ఒక్కటీ ఊహించని స్థాయికి పెరిగాయి. నగరాలను బట్టి, బ్రాండ్లను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉన్నాయి.
చివరగా చెప్పేదేంటంటే.. గడిచిన 26 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగింది. ప్రజల ఆదాయాలు కూడా పెరిగాయి. అయితే ఆ పెరిగిన ఆదాయానికి సమానంగా పెరుగుతున్న రోజువారీ ఖర్చులను బ్యాలెన్స్ చేయడమే నేటి సామాన్యుడికి, పాలకులకు ఉన్న అతిపెద్ద టాస్క్. ధరలు పెరుగుతున్న స్పీడుకు తమ ఆదాయాలు పెరుగుతున్న రేటుకు సంబంధం ఉండటం లేదని దిగువ మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డబ్బునోడికి వద్దన్నా సంపద పెరుగుతుంటే తమకు మాత్రం విద్యా, వైద్యం, ఆహారం లాంటి వాటిని పొందటం కూడా కష్టతరం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
