హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఆయిల్ శనివారం ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ పేరిట 10 కేజీల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను, దానితో పాటు అత్యంత వేగవంతమైన 4 గంటల ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 5 కేజీల 'ఛోటూ' సిలిండర్ కూడా బుక్ చేసిన 4 గంటల్లోనే డెలివరీ అవుతుంది. ఈ కొత్త కాంపోజిట్ సిలిండర్ తేలికగా, తుప్పు పట్టని సాంకేతికతతో తయారైందని కంపెనీ చైర్మన్ ఎ.ఎస్.సాహ్నీ తెలిపారు.
ఇందులో గ్యాస్ స్థాయి ఎంత ఉందో బయట నుంచి తెలుసుకోవచ్చని అన్నారు. ఉద్యోగులు, చిన్న కుటుంబాల అవసరాలకు ఇది ఎంతో అనుకూలమని తెలిపారు. కాగా, తొలిదశలో ఈ సేవలను పుణే, గుర్గావ్, ఇండోర్, కోయంబత్తూర్ నగరాల్లో ప్రారంభించారు. ఆగస్టు విడతలో మరో 25 నగరాలకు, అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. వినియోగదారులు 'ఇండియన్‌ఆయిల్ వన్' యాప్, వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా కొత్త కనెక్షన్లు పొందొచ్చు, రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు.
