న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్‌కు తలొగ్గి ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. నీట్ పేపర్ లీక్ అయిన రోజు నుంచే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. కానీ కాక్రోచ్ పార్టీ అలుపెరుగని పోరాటం చేయడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దాదాపు నెలన్నర పాటు ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా సీజేపీ ఆందోళనలు కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.
ఓవైపు సీజేపీ.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో చేసేదేమిలేక మోడీ సర్కార్ తలొగ్గింది. యువత డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలైన తొలి రోజే ఆయన పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారంటా. కానీ బీజేపీ హైకమాండ్ ప్రధాన్ నిర్ణయాన్ని తిరస్కరించిందట. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గియా ఈ విషయాన్ని వెల్లడించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ సీనియర్ నేత, మంత్రి కైలాష్ విజయవర్గియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (జులై 26) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన ప్రారంభించిన మొదటి రోజే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.
అయితే, పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకునే వరకు రాజీనామా సమర్పించవద్దని.. దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారని చెప్పారు. పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు ప్రధాన్ తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని తెలిపారు. సీజేపీ ఆందోళనలు ఉధృతం కావడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పార్టీ నిర్ణయం మేరకు ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా సమర్పించారని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో హింసను సృష్టించి దేశంలో అస్థిరత సృష్టించాలని చూసిన విదేశీ శక్తుల కుట్రలను ప్రధాన్ రాజీనామాతో తిప్పకొట్టగలిగామని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల ఆందోళనను రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష ఇండీ కూటమి తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిందని.. ఈ తరుణంలో కాక్రోచ్ జనతా పార్టీ వారికి ఒక ఆశాకిరణంలా కనిపించిందని విమర్శించారు.
దేశం సరైన దిశలో పయనిస్తోందని.. అందుకు బీజేపీకి సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ సిద్ధాంతం.. ఆయన ఆలోచన విధానంపై చాలా జాలిగా ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటో ఆయన ఇంకా అర్థం చేసుకోవాలని సూచించారు.
