బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అర్ధనగ్న హంగామాపై స్పీకర్ ఆరా..డీజీపీ, సీపీ, డీసీపీలతో భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అర్ధనగ్న హంగామాపై స్పీకర్ ఆరా..డీజీపీ, సీపీ, డీసీపీలతో భేటీ
  • బాధిత మహిళా పోలీసుల నుంచి వివరాల సేకరణ
  • తోపులాట జరిగిన ప్రాంతంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్ల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళా ఎస్ఐ సహా కానిస్టేబుళ్లతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ గురువారం భేటీ అయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్, డీసీపీ శిల్పవల్లి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో కలిసి వివరాలు తెలుసుకున్నారు.

అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనకు దారి తీసిన పరిస్థితులతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బెదిరింపులు, మహిళా పోలీసులు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆరా తీశారు. మరోవైపు బాధిత మహిళా కానిస్టేబుళ్ల స్టేట్​మెంట్లను సైఫాబాద్ పోలీసులు రికార్డ్ చేశారు. తోపులాట జరిగిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారులు సహా పలువురు కానిస్టేబుళ్ల నుంచి వివరాలు సేకరించారు. కాగా, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, పోలీసులు రికార్డ్​ చేసిన వీడియో, ఫొటోలతో కూడిన రిపోర్టులను అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్​సహా కోర్టుకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు బాధిత కానిస్టేబుళ్ల ఫిర్యాదు ఆధారంగా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి75(1) బీఎన్‌‌ఎస్‌‌ సెక్షన్‌‌ సహా 74, 79, 121(1), 130, 132, 296, 351(2), 352 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ రిజిస్టర్ చేశారు. ప్రధాన నిందితుడిగా (ఏ1) హరీశ్​రావు, ఏ2గా నవీన్‌‌ రెడ్డి, ఏ3గా సుధీర్‌‌‌‌రెడ్డి, ఏ4గా కేటీఆర్‌‌‌‌సహా మరికొందరిని నిందితులుగా చేర్చారు.