ముంబై: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 1,075 కోట్ల రికార్డ్ లాభాన్ని (నెట్) నమోదు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన రూ. 463 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 132.4 శాతం ఎక్కువ. బ్యాంక్ మొత్తం కస్టమర్ బిజినెస్ (లోన్లు + డిపాజిట్లు) ఏడాది ప్రాతిపదికన 18.6శాతం పెరిగి రూ. 6,04,776 కోట్లకు చేరింది. ఇందులో లోన్లు 20.6శాతం వృద్ధితో రూ. 3,05,370 కోట్లకు, కస్టమర్ డిపాజిట్లు 16.6శాతం పెరిగి రూ. 2,99,405 కోట్లకు చేరాయి.
గ్రాస్ ఎన్‌పీఏ కిందటేడాది జూన్ క్వార్టర్‌లోని 1.97శాతం నుంచి క్యూ1 లో 1.51శాతానికి, నెట్ ఎన్‌పీఏ 0.55శాతం నుంచి 0.44శాతానికి మెరుగుపడ్డాయి. బ్యాంక్ నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ 5.96 శాతానికి పెరిగింది. "గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్‌తో నాణ్యమైన బ్యాంకును నిర్మిస్తున్నాం. మా అసెట్ క్వాలిటీ మెరుగుపడుతోంది. బ్యాంకింగ్ సాంకేతికతపై చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాన్నిస్తూ, లాభాలు పెరగడంలో సాయపడుతున్నాయి" అని బ్యాంక్ సీఈఓ వీ వైద్యనాథన్ తెలిపారు.
