వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: పొలిటికల్ రిటైర్మెంట్‎పై సిద్ధరామయ్య కీలక ప్రకటన

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: పొలిటికల్ రిటైర్మెంట్‎పై సిద్ధరామయ్య కీలక ప్రకటన

బెంగళూర్: వచ్చే ఎన్నికల్లో పోటీపై కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. 2028 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. వయస్సు, ఆరోగ్య సమస్యలు, రాజకీయాల్లో పెరుగుతున్న అవినీతిని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 

ఆదివారం (జులై 26) మండ్య జిల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయకున్నప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని.. ప్రజల కష్టసుఖాలలో వారికి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. 

వరుణ నియోజకవర్గ ప్రజలు మళ్లీ పోటీ చేయాలని తనను కోరుతున్నారని.. కానీ వయస్సు, ఆరోగ్య సమస్యలు, రాజకీయాల్లో పెరిగిపోతున్న అవినీతి కారణంగా తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తనకు 79 సంవత్సరాలని.. 2028 ఎన్నికల నాటికి 82 ఏళ్లు వస్తాయని ఇకపై మునుపటిలాంటి శక్తితో పనిచేయలేనని పేర్కొన్నారు.

అవినీతిమయంగా రాజకీయ రంగం:

రాజకీయ రంగం తీవ్రంగా అవినీతిమయమైందని సిద్ధరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. తాను 1978లో తాలూకా బోర్డు సభ్యునిగా ప్రజా జీవితంలోకి ప్రవేశించానని.. 2028 నాటికి రాజకీయాల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటానని తెలిపారు. నా రాజకీయ ప్రస్థానంలో విజయాలు, అపజయాలు రెండింటినీ చూశానన్నారు. తన రాజకీయ జీవితంలో నైతిక విలువలు, సూత్రాల విషయంలో ఎన్నడూ రాజీపడలేదని.. నా మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించలేదని వ్యాఖ్యానించారు. 

ఈ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు ఓటర్లకు డబ్బు ఇవ్వాల్సి వస్తోందని.. రాజకీయాలు తీవ్రంగా అవినీతిమయమయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ రాజకీయాలకు చోటు లేకుండా పోయిందని అన్నారు. ఒకప్పుడు తన నియోజకవర్గ ప్రజలు డబ్బులు విరాళంగా ఇచ్చి తన ఎన్నికల ప్రచారాలకు మద్దతు ఇచ్చేవారని కూడా గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు పంచాల్సి వస్తోందని అన్నారు. 

కాగా, పవర్ షేరింగ్ లో భాగంగా సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. మరో రెండేళ్లలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య చేసిన ప్రకటన కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారింది.