చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కాయల్విళి కేసు నమోదు అయ్యింది. ఓ బ్యాంక్ మేనేజర్‌పై దాడి కేసులో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కాయల్విళి బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు, రాజకీయ బలం ఉందని భౌతిక దాడులకు దిగుతారా అంటూ ఆమె తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు.
అసలేం జరిగిందంటే..?
చెన్నైలోని అడయార్ ఏరియాలో కాయల్విళికి ఓ భవనం ఉంది. ఈ బిల్డింగ్‌ను ఎస్బీఐ బ్యాంక్‌కు లీజుకు ఇచ్చారు. జులై 20న ఆమె బ్యాంక్‌కు వెళ్లారు. ఈ క్రమంలో బ్యాంకు ఉన్న భవనంలోని లిఫ్ట్ విషయంలో కాయల్విళి, బ్రాంచ్ మేనేజర్‌కు మధ్య వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్ పని చేయకపోవడంతో రిపేర్ చేయించాలని మేనేజర్ ఆమెను కోరాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాయల్విళి బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేశారు.
మాటామాటా పెరగడంతో ఆమె మేనేజర్ చెంప చెల్లుమనిపించారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆమెను ఆపేందుకు ప్రయత్నించాడు. కాయల్విళి బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేయడం బ్యాంక్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కాయల్విళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
