వాషింగ్టన్ / కాలిఫోర్నియా: ప్రముఖ టెక్ దిగ్గజం 'మెటా' మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా వినియోగదారుల అనుమతి తీసుకోకుండా వారి ఫొటోలను సేకరించి, తన కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్ కోసం తలపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) టెక్నాలజీకి వాడుతోందంటూ అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఇల్లినాయిస్, కాలిఫోర్నియా రాష్ట్రాలకు చెందిన కొందరు తల్లిదండ్రులు, వారి పిల్లలు కలిసి ఇల్లినాయిస్ డిస్ట్రిక్ట్ కోర్టులో 66 పేజీలతో కూడిన ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
మెటాకు చెందిన రే-బాన్, ఓక్లే స్మార్ట్ గ్లాసెస్ కోసం 'నేమ్‌ట్యాగ్' అనే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఈ సిస్టమ్ గ్లాసెస్ కెమెరా ద్వారా రికార్డైన ముఖాలను బయోమెట్రిక్ సిగ్నేచర్లుగా మార్చి, యూజర్ ఫోన్‌లోని డేటాతో పోల్చుకుంటుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని పబ్లిక్ ఖాతాల నుంచి ఫొటోలను సేకరించి ఈ డేటాను తయారు చేశారని పిటిషనర్లు ఆరోపించారు. యూజర్ల సమ్మతి లేకుండానే ఈ చిత్రాలను 'ఎము', 'మ్యూజ్ ఇమేజ్' వంటి జనరేటివ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఖండించిన మెటా..
ఈ ఆరోపణలను మెటా తీవ్రంగా ఖండించింది. ఇది తమ పనితీరును తప్పుగా చిత్రీకరించడమేనని స్పష్టం చేసింది. ‘నేమ్‌ట్యాగ్’ వ్యవస్థను తాము ఇంకా వినియోగదారులకు విడుదల చేయలేదని, దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అయితే, 2021 సెప్టెంబర్ నుంచి మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసిన మిలియన్ల కొద్దీ యూజర్లకు ఈ వ్యాజ్యం వర్తిస్తుందని పిటిషనర్లు అంచనా వేస్తున్నారు.
