- పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యే ధ్యేయం
- విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వద్దుడీజీపీ సీవీ ఆనంద్
- మంచిరేవులలో వైఐపీఎస్ బ్లాక్-1 నిర్మాణానికి భూమి పూజ
హైదరాబాద్, వెలుగు: ఆర్మీ, సైనిక్ స్కూళ్ల తరహాలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను అభివృద్ధి చేస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీసు సంక్షేమంలో కీలక భాగమన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు తమ విధులపై మరింత దృష్టి సారిస్తాని పేర్కొన్నారు. మంచిరేవులలోని ఆక్టోపస్- గ్రేహౌండ్స్ ప్రాంగణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) అకడమిక్ బ్లాక్-1 నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా డీజేపీ మాట్లాడుతూ 2024 డిసెంబరులో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో తాత్కాలిక ప్రాంగణంలో 120 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభమైందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య సుమారు 360కు చేరిందన్నారు. కొత్త బిల్డింగ్ పూర్తయితే వచ్చే ఏడాది 700 నుంచి 720 మందికి చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, డీజీ (ఆక్టోపస్) అనిల్‌కుమార్ పోలీస్ ఉన్నతాధికారులు సహా స్కూల్ పిన్సిపాల్ అనితారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
