- కిలోల బరువున్న రెండు నెలల పసికందుకూ ఆపరేషన్ సక్సెస్
- నిమ్స్ డాక్టర్లను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా సర్జరీలు నిర్వహించి ప్రాణం పోసిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నిమ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ ను నిర్వహించారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడంతో చిన్నారులకు శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్లు ఎం. అమరేష్ రావు, డి. రమణ ధన్నపునేని సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్యాంప్ లో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న 19 మంది చిన్నారులకు డాక్టర్లు ఆపరేషన్లు పూర్తి చేశారు. ముఖ్యంగా, కేవలం రెండు కిలోల బరువు మాత్రమే ఉన్న రెండు నెలల పసికందుకు సైతం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలపడంపై సీఎం వైద్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
