టెహ్రాన్: శాంతియుత నిరసనకారులను కాల్చి చంపితే మేం రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. అమెరికా దాడులు చేస్తే మేం చేతులు కట్టుకుని కూర్చొమని.. ప్రతిస్పందన ఊహించని రీతిలో భయంకరంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారుడు అలీ షంఖానీ మాట్లాడుతూ.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దన్నారు.
ఏ సాకుతోనైనా ఇరాన్ భద్రతపై దాడి జరిగితే ప్రతి స్పందన భయంకరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ భద్రత అనేది ఒక రెడ్ లైన్.. దానిపై దాడి చేయడం సాహసం అని పేర్కొన్నారు. ట్రంప్ సాహసపూరిత చర్యల్లో నిమగ్నమై ఉన్నారని.. అమెరికన్లు వారి సైనికులను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, గాజా వరకు అమెరికా రెస్క్యూ రికార్డు ఇరానియన్లకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు.
ట్రంప్ ఏమన్నారంటే..?
ఇరాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనలను అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. శాంతియుత నిరసనకారులను కాల్చి చంపితే చూస్తూ ఊరుకోమని.. వాళ్లకు అమెరికా అండగా నిలుస్తోందని చెప్పారు. నిరసనకారులను చంపితే యుద్ధం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని సంచలన వార్నింగ్ ఇచ్చారు.
