ప్రపంచ బయోసైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌: బయోఏసియా 2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి..

ప్రపంచ బయోసైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌: బయోఏసియా 2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: ప్రపంచ బయోసైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 23 ఏళ్ల క్రితం బయో ఏసియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ కు చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్ వేర్  నగరం అనే గుర్తింపు మాత్రమే ఉండేదని, ఈ రోజు మాత్రం హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. హైదరాబాద్ లో బయోఏషియా సదస్సు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దూరదృష్టిగల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల బలంతో హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, పరిశోధన, డిజైన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని సీఎం చెప్పారు. గత రెండేళ్లలోనే బయో సైన్సెస్ రంగంలో 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. కొద్ది వారాల క్రితం దావోస్ లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని, జీనోమ్ వ్యాలీ విస్తరణ, వన్ బయో ప్రారంభం, గ్రీన్ ఫార్మా సిటీ వేగవంతం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు ఆహ్వానం వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని, దృఢమైన దృష్టి ఫలితమని స్పష్టం చేశారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే బయోఏషియా 2026 అని అన్నారు.

బయోఏషియా తన పేరును దాటి బయోవరల్డ్ గా మారుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. ఫార్మా, బయో సైన్సెస్, ఐయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్యరంగాల ప్రముఖులు, బిజినెస్ లీడర్లు ఇక్కడ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

ఇటీవల ప్రకటించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రకారం 2014నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యసస్థగా ఎదగడమే లక్ష్మమని సీఎం చెప్పారు. ప్రస్తుత బయో సైన్సెస్ ధోరణుల్లో పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టపు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని అన్నారు. విశ్వసనియమైన, స్థిరమైన పెట్టుబడి వాతావరణం కావాలంటే తెలంగాణే సమాధానమని, హైదరాబాద్ మీ గమ్యమని స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు తయారీ నుంచి ఆవిష్కరణ వరకు తెలంగాణ ప్రపంచ స్థాయిలో ముందుకు సాగుతోందని అన్నారు.

భారత్లోనే కాదు. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ ఇప్పటికీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని, ఇప్పుడు కలిసి సమగ్ర బయో సైన్సెస్ రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని, జీసీసీలు స్టాపించాలని, ఆవిష్కరణు కేంద్రాలు నిర్మించాలని కోరారు. మాలిక్యూల్స్, ఔషరాల డిజైన్, క్లినికల్ అనలిటిక్స్, ఏఐ ప్లాట్ ఫారమ్ లు, డిజిటల్ తయారీకి తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ బయో సైన్సెస్ రాజధానిగా ఎదుగుతుందని అన్నారు. ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉందని, తెలంగాలు అంటే వ్యాపారమని, తెలంగాణ ఎదుగుతోందని స్పష్టం చేస్తూ ఈ ఎదుగుదల లో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.