ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మహిళా సాధికారత ఏఐ కలయికపై చేసిన కామెంట్స్ ఆకట్టుకున్నాయి. 'టాటా ఏఐ సఖి ఇమ్మర్షన్' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, నేటి కాలంలో మహిళలకు ఏఐ ఒక దిక్సూచిలా ఎలా మారుతుందో పురాణగాథలతో పోలుస్తూ ఆసక్తికరంగా వివరించారు.
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే మార్గనిర్దేశం చేసే సారథిగా నిలిచారో.. నేడు మహిళల సాధికారత యుద్ధంలో AI అదే విధమైన పాత్రను పోషిస్తోందని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. అప్పటి సారథి రథాన్ని నడిపితే, ఇప్పటి ఏఐ సారథి మహిళల చేతిలోని మొబైల్ ఫోన్‌లో కొలువై ఉండి వారికి దారి చూపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, మహిళల వ్యవస్థాపక నైపుణ్యాలను పెంచే ఒక అద్భుతమైన సాధనమని స్మృతి చెప్పారు.
ALSO READ : MSMEలకు బంపర్ ఆఫర్.. UPI తరహాలో ఏఐ ప్లాట్‌ఫామ్
దేశంలోని సాధారణ మహిళల ఆర్థిక క్రమశిక్షణ గురించి ఇరానీ కీలక గణాంకాలను వెల్లడించారు. గత 10 ఏళ్లలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 10 కోట్ల మంది మహిళలు రూ.12 లక్షల కోట్ల రుణాలు తీసుకుని.. అందులో 96 శాతం తిరిగి చెల్లించారని ప్రశంసించారు. అలాగే హస్తకళలు, చేనేత రంగంలో ఉన్న 30 లక్షల మంది మహిళలు ఏటా రూ.33వేల కోట్ల విలువైన ఎగుమతులు చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. డిజిటల్ అక్షరాస్యతలోనూ మహిళలు వేగంగా ఎదుగుతున్నారని, ఇప్పటికే 2.72 కోట్ల మంది మహిళలు డిజిటల్ సర్టిఫికేట్లు పొందారని తెలిపారు.
అత్తా కోడళ్లు.. ఏఐ సాగు
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఏఐ నేర్పించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లపై స్పందిస్తూ.. ఆమె తనదైన శైలిలో చమత్కరించారు. అత్తకు నేర్పండి, కోడలికి నేర్పండి.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే 'అత్త కూడా ఒకప్పుడు కోడలే' అంటూ తన పాత టీవీ సీరియల్ డైలాగ్‌ను గుర్తుచేస్తూ నవ్వులు పూయించారు స్మృతి. మహిళలు కేవలం అభివృద్ధిలో ప్రయాణికులుగా మాత్రమే ఉండకూడదని, దేశాభివృద్ధి అనే వాహనానికి స్టీరింగ్ పట్టి నడిపించే వారవ్వాలనిపిలుపునిచ్చారు. అయితే ఏఐని బాధ్యతాయుతంగా వాడాలని ఆమె హెచ్చరించారు. ఏఐ ఇచ్చే సమాచారం ఎప్పుడూ 100 శాతం కచ్చితంగా ఉండకపోవచ్చని, ఆధార్ నంబర్లు, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని అన్నారు.
