MSMEలకు బంపర్ ఆఫర్.. UPI తరహాలో ఏఐ ప్లాట్‌ఫామ్: అశ్విని వైష్ణవ్

MSMEలకు బంపర్ ఆఫర్.. UPI తరహాలో ఏఐ ప్లాట్‌ఫామ్: అశ్విని వైష్ణవ్

దేశరాజధాని ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతున్న వేళ.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇండియా ఏఐ మిషన్ 2.0కి సంబంధించిన కీలక ప్రణాళికలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న MSMEల రూపురేఖలను మార్చే విధంగా ప్రభుత్వం ఈ కొత్త మిషన్‌ను రూపొందిస్తోందని అన్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల కోసం సిద్ధంగా ఉన్న ఏఐ పరిష్కారాలను ఒక ప్యాకేజీ రూపంలో అందించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

భారతదేశంలో UPI ఏ విధంగా అయితే డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవం సృష్టించిందో.. అదే తరహాలో ఒక ఉమ్మడి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలకు అవసరమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ పరిష్కారాలను నేరుగా వినియోగదారులకు అందించకుండా.. మొదట వాటిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరీక్షించి, అవి విజయవంతం అయిన తర్వాతే ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురానున్నట్లు వివరించారు. దీనివల్ల చిన్న వ్యాపారులు ఎటువంటి భయం లేకుండా లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని వాడుకునే అవకాశం కలుగుతుందన్నారు.

ALSO READ : సంపాదన పెరుగుతున్నా పేదరికం ఎందుకు వీడటం లేదు?

ఈ మిషన్ ద్వారా భారత్‌లో తయారైన ఏఐ ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. కేవలం ఉత్పాదకతను పెంచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నీటిని, విద్యుత్తును ఆదా చేస్తూ ఉత్పాదకతను పెంచే సరికొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయాలని మంత్రి పరిశోధకులను, స్టార్టప్‌లను కోరారు. భారతీయ ఎంఎస్ఎంఈలు ప్రపంచ పోటీని తట్టుకునేలా సిద్ధం చేయడమే ఇండియా ఏఐ మిషన్ 2.0 లక్ష్యమని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.