మిడిల్ క్లాస్ ట్రాప్: సంపాదన పెరుగుతున్నా పేదరికం ఎందుకు వీడటం లేదు?

మిడిల్ క్లాస్ ట్రాప్: సంపాదన పెరుగుతున్నా పేదరికం ఎందుకు వీడటం లేదు?

భారతీయ మధ్యతరగతి ప్రజలు ఎంత సంపాదించినా ఎందుకు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు? ధనవంతులు మరింత ధనవంతులు అవుతుంటే, మధ్యతరగతి వారు మాత్రం ఎందుకు అదే స్థితిలో ఉండిపోతున్నారనే విషయాల వెనుక ఉన్న లాజిక్ చాలా మందికి తెలియదు. దేశంలో మధ్యతరగతి అనేది ఒక స్థిరత్వానికి చిహ్నం. కానీ నేడు అది తాడు మీద నడక లాగా మారింది. ఒక చిన్న పొరపాటు జరిగితే మొత్తం కుటుంబం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి నెలకొంది. సంపాదన పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా.. చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవడానికి గల ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. ఆదాయం కంటే వేగంగా పెరుగుతున్న ఖర్చులు:
గత దశాబ్ద కాలంలో మధ్యతరగతి ప్రజల జీతాల పెరుగుదల రేటు కేవలం 0.4% మాత్రమే. కానీ ఇదే సమయంలో నిత్యావసరాలు, విద్య, వైద్యం, గృహ నిర్మాణ ఖర్చులు ఆకాశాన్నంటాయి. మీరు ఎంత ఎక్కువగా సంపాదిస్తున్నా, ద్రవ్యోల్బణం మీ పొదుపును మింగేస్తోంది. ఎక్కువ సంపాదిస్తున్నాం అనే భ్రమలో ఉన్నామే తప్ప.. ఖర్చుల తర్వాత మిగిలే నికర ఆదాయం మాత్రం క్రమంగా తగ్గుతూపోతోంది.

2. EMIల మాయాజాలం:
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ నుంచి కారు వరకు ప్రతిదీ ఈఎంఐలో లభిస్తోంది. చిన్న నెలవారీ వాయిదానే కదా అని చేసే అప్పులు మధ్యతరగతి వారిని ఒక అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఆదాయంలో ఎక్కువ భాగం ఈ వాయిదాలకే సరిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అనుకోని అనారోగ్యం లేదా జాబ్ లాస్ ఎదురైతే ఈ అప్పుల కోట ఒక్కసారిగా కూలిపోతుంది. కలల జీవితం కోసం చేసే అప్పులు చివరకు మానసిక ఒత్తిడిగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు.

3.  నిశ్శబ్ద శత్రువుగా లైఫ్ స్టైల్:
జీతం పెరగగానే చాలామంది చేసే మొదటి పని తమ లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, బ్రాండెడ్ బట్టలు.. ఇలా పెరిగిన ఆదాయం కంటే వేగంగా ఖర్చులు పెరుగుతాయి. దీనినే 'లైఫ్ స్టైల్ క్రీప్' అంటారు. పక్కవారితో పోల్చుకోవడం, సమాజంలో హోదా కోసం తాపత్రయపడటం వల్ల మధ్యతరగతి వారు సంపదను సృష్టి అవకాశాన్ని కోల్పోతున్నారు.

4. సమాజంలో గౌరవం కోసం పాకులాట:
భారతీయ సమాజంలో సక్సెస్ అంటే కొన్ని వస్తువులను కలిగి ఉండటమే అనే బలమైన భావన ఉంది. మంచి స్కూల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఖరీదైన పార్టీలు.. ఇవన్నీ ఆర్థిక లక్ష్యాల కంటే గౌరవ సూచికలుగా మారిపోయాయి. ఈ సామాజిక హోదాను కాపాడుకోవడం కోసం మధ్యతరగతి వారు తమ శక్తికి మించి అప్పులు చేసి చివరికి ఆర్థిక ప్రశాంతతను కోల్పోతున్నారు.

5. వ్యవస్థాగత లోపాలు:
వ్యక్తిగత అలవాట్లే కాకుండా దేశీయ ఆర్థిక పరిస్థితులు కూడా మధ్యతరగతిని పిండేస్తున్నాయి. హోమ్ లోన్స్ పెరిగిపోవడం, సేవింగ్స్ రేటు చారిత్రక కనిష్టానికి పడిపోవడం వంటివి ప్రమాదకర సంకేతాలు. దీనికి తోడు టెక్నాలజీ మార్పులు, ఆటోమేషన్ వల్ల ఉద్యోగ భద్రత కరువవుతోంది. ధనవంతులు వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని పెట్టుబడుల ద్వారా సంపాదిస్తుంటే, మధ్యతరగతి వారు మాత్రం కేవలం పన్నులు కట్టడానికి, వడ్డీలు చెల్లించడానికే కష్టపడుతున్నారు.

ధనవంతుల అవ్వడం కంటే సంపదను సృష్టించడం ముఖ్యం అని మధ్యతరగతి గ్రహించాలి. అనవసరపు ఈఎంఐలను తగ్గించుకోవడం, ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు పెంచుకోకుండా పొదుపు చేయడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయాలి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే కేవలం పెట్టుబడి పెట్టడం కాదు.. మన ఆదాయ వ్యయాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండటం. మధ్యతరగతి ట్రాప్ నుండి బయటపడాలంటే ముందుగా ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిందే అంటున్నారు నిపుణులు.