అడియాలా: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో చీకటి గదిలో నిర్భందించి మానసిక హింసకు గురి చేస్తున్నారని ఆయన కుమారులు కాసిం ఖాన్, సులేమాన్ ఇసా ఖాన్ ఆరోపించిన క్రమంలో ఆయన ఆరోగ్యంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన వైద్యం అందించాలని 14 దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ క్రికెట్ మాజీ కెప్టెన్స్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అప్పీల్ చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. టీమిండియా మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఈ 14 మందిలో ఉన్నారు.
14 Former International Cricket Captains, including Padma Bhushan Sunil Gavaskar, Padma Bhushan Kapil Dev, Greg Chappell, Stephen Waugh, write to the Government of Pakistan regarding the reported condition of Imran Khan, former Prime Minister and former Captain of the Pakistan… pic.twitter.com/X0gmL2nE28
— ANI (@ANI) February 17, 2026
పాకిస్తాన్ జట్టుకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అయిన ఆ దేశ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు అవినీతి కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్కు నిపుణులైన వైద్యులు చికిత్స చేయాలని.. నిరంతర వైద్య సహాయం అందించాలని కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్.. మిగిలిన 12 మంది మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. జైలులో ఉన్న ఇమ్రాన్ను కలిసేందుకు మానవత్వంతో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు అనుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈ 14 మంది మాజీ కెప్టెన్లు విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నెల నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్న తమ తండ్రిని కొన్ని నెలలుగా చూడలేదని, మాట్లాడలేదని ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ మాట్లాడుతూ.. “మా నాన్నను రెండేండ్లకు పైగా ఒంటరిగా నిర్బంధ గదిలో ఉంచారు. అక్కడ ఆయనకు మురికి నీరు ఇస్తున్నారు. హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారు. అక్కడి పరిస్థితులు అసహ్యకరంగా ఉన్నాయి. కనీసం జైలు గార్డులను కూడా ఆయనతో మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఆయనను బయటకు తీసుకురావడానికి ఏ మార్గం కనిపించడం లేదు. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
