ఆకాశంలో అద్భుతం: 2026 సూర్యగ్రహణం 'రింగ్ ఆఫ్ ఫైర్' ఎప్పుడు ? ఎక్కడ కనిపిస్తుంది?

ఆకాశంలో అద్భుతం: 2026 సూర్యగ్రహణం 'రింగ్ ఆఫ్ ఫైర్' ఎప్పుడు ? ఎక్కడ కనిపిస్తుంది?

ఖగోళంలో జరిగే అద్భుతాలలో సూర్యగ్రహణం ఒకటి. శాస్త్రవేత్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ వింతను చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే 2026లో రాబోయే ఈ ప్రత్యేకమైన గ్రహణం గురించి చూద్దామా.... 

ఈ  సూర్యగ్రహణం 17 ఫిబ్రవరి  2026న రాబోతుంది. అయితే మన దేశంలో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. భారతదేశంలో ఉండేవారు ఈ అద్భుతాన్ని డైరెక్ట్ చూడలేకపోయినా, NASA వంటి అంతరిక్ష సంస్థల వెబ్‌సైట్‌  లేదా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా లైవ్ ప్రసారాన్ని చూడవచ్చు.

కంకణ సూర్యగ్రహణం అంటే ఏమిటి?


సాధారణంగా దీనిని "రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలుస్తారు. చంద్రుడు భూమికి దూరంగా ఉన్నప్పుడు, సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. అప్పుడు సూర్యుడి మధ్య భాగం చంద్రుడితో మూసుకుపోయి, చుట్టూ ఉన్న అంచులు మాత్రం ఒక ప్రకాశవంతమైన గాజు లాగా లేదా నిప్పు వలయంలా కనిపిస్తాయి. అందుకే దీనిని 'కంకణ' అంటే గాజు లాంటి ఆకారం ఉన్న  సూర్యగ్రహణం అంటారు.

ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది?


ఈ అద్భుత దృశ్యం దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బోట్స్వానా, నమీబియా, మారిషస్, టాంజానియా, అర్జెంటీనా సహా దక్షిణ అమెరికాలోని కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలను ఆకర్షించే అత్యంత అద్భుతమైన ఖగోళ దృగ్విషయాలలో ఈ సూర్యగ్రహణం ఒకటి.

 సూర్యగ్రహణం అంటే ఏమిటి?


ఖగోళ శాస్త్రం ప్రకారం, భూమికి ఇంకా సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడటం వల్ల సూర్యుడు మనకు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించదు.