AI సమ్మిట్‌లో తప్పులు జరిగాయి.. నిర్వహణ లోపాలపై కేంద్ర మంత్రి క్షమాపణలు

AI సమ్మిట్‌లో తప్పులు జరిగాయి.. నిర్వహణ లోపాలపై కేంద్ర మంత్రి క్షమాపణలు

ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో చోటుచేసుకున్న నిర్వహణ లోపాలు, ఒక స్టార్టప్ సీఈఓ ఎదుర్కొన్న చేదు అనుభవంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా స్పందించారు. ఈ సదస్సులో జరిగిన పొరపాట్లకు గానూ ఎగ్జిబిటర్లకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు కేంద్ర మంత్రి.

భారత్ మండపంలో జరుగుతున్న ఈ సమ్మిట్ లో భద్రతా కారణాల దృష్ట్యా ఎగ్జిబిషన్ ఏరియాను ఖాళీ చేయించడం, ఆ సమయంలో సమన్వయ లోపం వల్ల ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడటంపై మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లకు కలిగిన అసౌకర్యానికి తాను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇంతటి భారీ స్థాయి సదస్సులో 'మిస్ మేనేజ్మెంట్' జరిగిందని ఆయన అంగీకరించడం గమనార్హం.

నియోసాపియన్ సీఈఓ చేదు అనుభవం..

నిన్న బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'నియోసాపియన్' సీఈఓ ధనంజయ్ యాదవ్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఈ చర్చకు దారితీసింది. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా సెక్యూరిటీ సిబ్బంది స్టాల్స్ ఖాళీ చేయమని కోరగా.. తన కంపెనీ రూపొందించిన పేటెంటెడ్ 'ఏఐ వేరబుల్' పరికరాలను అక్కడే వదిలి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది భరోసా ఇవ్వడంతోనే తాను వాటిని అక్కడ ఉంచానని, కానీ 6 గంటల తర్వాత తిరిగి వచ్చి చూస్తే తన విలువైన ఉత్పత్తులు దొంగతనానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హై-సెక్యూరిటీ జోన్‌లోనే దొంగలు చేతివాటం ప్రదర్శించటం నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపింది.

ప్రధాని పర్యటన వేళ భద్రతా దళాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఎగ్జిబిటర్ల వస్తువుల భద్రతను పర్యవేక్షించడంలో సెక్యూరిటీ  వైఫల్యం జరిగిందని, ఇది ఒక పాఠంగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించాల్సిన వేదికపైనే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎగ్జిబిటర్లు పడిన శ్రమను ప్రభుత్వం గుర్తిస్తుందని, నిర్వహణలో జరిగిన చిన్న చిన్న లోపాలను సరిదిద్ది, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు అశ్విని వైష్ణవ్.