మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. శుక్రవారం (జనవరి 2) దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన గెరెరోలో ఈ భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని జేఎఫ్జెడ్ తెలిపింది.
భూకంప కేంద్రం పసిఫిక్ తీరప్రాంత రిసార్ట్ అకాపుల్కో సమీపంలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలోని శాన్ మార్కోస్ పట్టణానికి సమీపంలో ఉందని పేర్కొంది. భూ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భారీ భవనాలు కుదుపునకు లోనయ్యాయి. భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహయక చర్యలు చేపట్టింది.
ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. గెరెరో రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడానని.. రాజధాని మెక్సికో నగరంలో ఎటువంటి నష్టం జరగలేదని ఆమె పేర్కొన్నారు. కాగా, శుక్రవారం (జనవరి 2) ఉదయం ఆమె ఉదయం జర్నలిస్టులతో మాట్లాడుతుండగా భూ ప్రకంపనలు సంభవించాయి. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం భయపడకుండా ప్రశాంతంగా జర్నలిస్టులను సురక్షిత ప్రదేశానికి తరలించారు.
