దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. దుర్గం చెరువును ఆక్రమించారని హైడ్రా అధికారి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా సూపర్ వైజర్ క్రాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు BNS 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు.
దుర్గం చెరువులో సుమారు 5 ఎకరాల భూమిని అక్రమించినట్లు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడిపై ఆరోపణలు ఉన్నాయి. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపి ఆక్రమించడమే గాకుండా STS ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ పార్కింగ్ గా వినియోగిస్తున్నారని హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ భూములకు 2014లోనే హెచ్ఎండీఏ, ఎఫ్ టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ఉన్నప్పటికీ చెరువును అక్రమించినట్లు తేల్చారు . ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. హైడ్రా అధికారి క్రాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆదారంగా హైడ్రా కమిషనర్ ఆదేశాలతో ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల మేర ఆక్రమణలను డిసెంబర్ 30న తొలగించింది హైడ్రా. చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో నెలకు సుమారు రూ.50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు తేలింది. వాహనాలను ఖాళీ చేయించి ఆక్రమిత ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు.
ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 116 ఎకరాలకు కుదింపుకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. NRSC శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి నింపి భూమి కబ్జా చేసినట్లు తేల్చారు. కొండలు తవ్విన మట్టిని చెరువులో డంపింగ్ చేసి స్కూల్ బస్సులు, ఐటీ కంపెనీల వాహనాలకు అక్రమ పార్కింగ్ నిర్వహిస్తున్నారు.
