T20 World Cup 2026: పాకిస్థాన్‌తో పాటు ఆ మూడు జట్లు సెమీస్‌కు వెళ్తాయి.. దిగ్గజ క్రికెటర్ జోస్యం

T20 World Cup 2026: పాకిస్థాన్‌తో పాటు ఆ మూడు జట్లు సెమీస్‌కు వెళ్తాయి.. దిగ్గజ క్రికెటర్ జోస్యం

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు నెల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీమిండియాతో పాటు మరికొన్ని జట్లు వరల్డ్ కప్ కు తమ స్క్వాడ్ ను ప్రకటించేశాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి 20 జట్లు పోటీ పడుతుండడంతో ఈ మెగా టోర్నీకి భారీ హైప్ నెలకొంది. ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు చేరుకునే జట్లు ఏవో పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ తన అంచనా చెప్పాడు. 

పాకిస్థాన్:
 
వసీం అక్రమ్ తమ సొంత దేశం పాకిస్థాన్ సెమీస్ కు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. 2009 తర్వాత పాకిస్థాన్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఈ సారి కూడా అండర్ డాగ్ గా బరిలోకి దిగుతుంది. సల్మాన్ అఘా కెప్టెన్సీలోని పాకిస్థాన్ పర్వాలేదనిపించేలా ఉంది. సూపర్-8 కు చేరుకోవడం ఈజీ అయినప్పటికీ టాప్-4 లో నిలవడం కష్టమనే చెప్పుకోవాలి. 2007లో ఫైనల్ కు చేరుకున్న పాకిస్థాన్.. 2009లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది.   

ఇండియా:

అక్రమ్ భారత జట్టు సెమీస్ కు వెళ్తుందని అంచనా వేశాడు. టీ20 వరల్డ్ కప్ టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డ కావడం.. జట్టు బలంగా ఉండడం.. గత రెండేళ్లుగా పొట్టి ఫార్మాట్ లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర కొనసాగించడం లాంటి అంశాలు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. స్థాయికి తగ్గట్టు ఆడితే సూర్యసేన ఫైనల్ కు చేరుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. 

ఆస్ట్రేలియా:

మిచెల్ మార్ష్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కు చేరుకుంటుందని అక్రమ్ జోస్యం చెప్పాడు. ఇటీవలే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇండియా తర్వాత ఫేవరేట్ గా ఈ టోర్నీలో అడుగు పెడుతోంది. అంచనాలు అందుకుంటే ఆసీస్ కు టాప్-4లో నిలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఐసీసీ టోర్నీల్లో బలమైన రికార్డ్.. ఆసీస్ కు ఊరటనిస్తోంది. 2021లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఆసీస్ మరో టైటిల్ పై కన్నేసింది.  

సౌతాఫ్రికా:

అక్రమ్ చెప్పిన నాలుగు జట్లలో సౌతాఫ్రికా కూడా ఉంది. సఫారీలు సెమీస్ కు చేరుకుంటాయని ఈ పాక్ దిగ్గజం అంచనా వేశాడు. చివరిసారిగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా రన్నరప్ గా నిలిచింది. ఇప్పటివరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని సౌతాఫ్రికా జట్టు తొలిసారి ఆ కలను సాకారం చేసుకోవాలని ఆరాటపడుతుంది. మార్కరం కెప్టెన్సీలోని సౌతాఫ్రికా జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. 

Also Read : బ్యాటింగే సన్ రైజర్స్ బలం.. లివింగ్ స్టోన్ రాకతో కమ్మిన్స్ సేన ప్లేయింగ్ 11 అదిరింది

ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి.

భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.