T20 World Cup 2026: రికెల్టన్, స్టబ్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

T20 World Cup 2026: రికెల్టన్, స్టబ్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం (జనవరి 2) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు  ఐడెన్ మార్క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో మెరుపులు మెరిపించే ట్రిస్టన్ స్టబ్స్ సౌతాఫ్రికా జట్టులో స్థానం దక్కించుకోలేకపోయారు. పక్కటెముకల  గాయం కారణంగా టీమిండియాతో టీ20సిరీస్ కు దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా తిరిగి జట్టులోకి చేరాడు. ఈ స్క్వాడ్ లో ఆశ్చర్యకరంగా కొంతమంది క్రికెటర్లకు తొలిసారి అవకాశం దక్కింది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాప్ ఆర్డర్ బ్యాటర్ జాసన్ స్మిత్ జట్టులోకి రావడం. స్మిత్ కు కేవలం ఐదు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన అనుభవం ఉన్నప్పటికీ ఎంపిక చేశారు. ఇటీవలే CSAT20 లీగ్ లో స్మిత్ 19 బంతుల్లో 68 పరుగులు చేసి తమ జట్టు డాల్ఫిన్స్‌ను ప్ల్య్ ఆఫ్స్ కు చేర్చాడు. SA20 లీగ్ లో 14 బంతుల్లో 41 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2024 రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికాతో పాటు గ్రూప్ డి లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఉన్నాయి. వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ ను  ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడతారు. 

"టీ20 ఇంటర్నేషనల్ (T20I) కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ స్క్వాడ్ లో కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జీ, డోనోవన్ ఫెర్రీరా, జార్జ్ లిండే, క్వెనా మఫాకా, జాసన్ స్మిత్ లకు తొలిసారి టీ20 వరల్డ్ కప్ లో ఎంపికయ్యారు". అని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో తెలిపింది. జట్టు ఎంపికపై మాట్లాడుతూ సెలక్షన్ కన్వీనర్ పాట్రిక్ మోరోనీ ఇలా అన్నాడు.. "మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఎంపిక చేసిన ఈ స్క్వాడ్ బలమైనదని.. ఇండియా, శ్రీలంకలో వరల్డ్ కప్ సాధించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము". అని ఆయన అన్నారు.

2026 టీ20 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా జట్టు:

ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, క్వింటన్ డి కాక్ , టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో  రబడా, జాసన్ స్మిత్