వీడిన సస్పెన్స్.. బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ 2026లో ఆడటంపై బీసీసీఐ క్లారిటీ

వీడిన సస్పెన్స్.. బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ 2026లో ఆడటంపై బీసీసీఐ క్లారిటీ

న్యూఢిల్లీ: ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఆ దేశంలో భారత వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే దాదాపు 10 మంది హిందులపై దాడులు జరిగాయి. బంగ్లాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంపైన ఎటాక్ చేశారు. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లు ఐపీఎల్‎లో ఆడటంపై సందిగ్ధం నెలకొంది.

బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడకుండా నిషేదించాలని ఇండియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన కేకేఆర్‎తో పాటు ఆ ప్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్‎పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షారుఖ్ ఖాన్ దేశ ద్రోహీ అంటూ హిందు సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో బంగ్లా క్రికెటర్స్ ఐపీఎల్ ఆటడంపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. 

ఈ మేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‎లో విదేశీ ఆటగాళ్లు ఆడటానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మినీ వేలంలో ఏడుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో కేకేఆర్ ఒకరిని కొనుగోలు చేసింది. ఫ్రాంచైజీలు పూల్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. బీసీసీఐ భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. ఇప్పటి వరకైతే బంగ్లాదేశ్ ప్లేయర్లను ఐపీఎల్‎ ఆడకుండా నిషేధం విధించాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అది మన చేతుల్లో లేదు. ప్రస్తుతానికి ఈ అంశంపై ఇంతకుమించి మాట్లాడలేను” అని పేర్కొన్నారు. 

బీసీసీఐ అధికారి వ్యాఖ్యలతో ఇప్పటి వరకైతే బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం విధించాలని ఒక క్లారిటీ వచ్చింది. ఐపీఎల్ ప్రారంభానికి మరో రెండు నెలల సమయం ఉండటంతో ఆలోపు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, 2025, డిసెంబర్ 15న జరిగిన ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో బంగ్లా  స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.