V6 News

టెర్రరిస్టుల పన్నాగాన్ని తిప్పికొట్టిన పోలీసులు

టెర్రరిస్టుల పన్నాగాన్ని తిప్పికొట్టిన పోలీసులు

నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

చండీగఢ్: స్వాతంత్ర్య సంబురాలకు ముందు పంజాబ్​లో టెర్రరిస్టుల పన్నాగాన్ని పోలీసులు తిప్పికొట్టారు. పాక్​కు చెందిన ఐఎస్ టెర్రరిస్ట్ గ్రూప్ మద్దతుతో పంజాబ్​లో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న నలుగురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు కలిసి చేపట్టిన ఈ ఆపరేషన్​లో నిందితుల నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, 2 పిస్టల్స్, 40 కాట్రిడ్జ్‌‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్​తో ఈ నలుగురికి సంబంధాలున్నట్లు గుర్తించామన్నారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చండీగఢ్​లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

యూపీలో జైషే యాక్టివిస్ట్ అరెస్ట్

టెర్రరిస్ట్ గ్రూప్  జైషే మహ్మద్‌‌(జేఈఎం)తో సంబంధాలున్న 19 ఏండ్ల హబీబుల్ ఇస్లాం అలియాస్ సైఫుల్లాను అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం తెలిపారు. నుపూర్​శర్మపై ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసిన జేఈఎం టెర్రరిస్ట్ మహ్మద్ నదీమ్(25) తెలిపిన వివరాల ప్రకారం ఫతేపూర్ జిల్లాలో ఉంటున్న సైఫుల్లాను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం అరెస్ట్ చేసిందని డీజీపీ నవీన్ అరోరా వెల్లడించారు. నదీమ్​ తనకు తెలుసునని, వాళ్లిద్దరికీ జేఈఎంతో సంబంధాలున్నట్లు సైఫుల్లా ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. బీహార్​కు చెందిన సైఫుల్లా సీక్రెట్ ఐడీలను తయారు చేయడంలో దిట్ట అని, నదీమ్‌‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్​కు చెందిన 50 మంది టెర్రరిస్టులకు ఐడీలు అందజేశాడని చెప్పారు. అతడు జీహాదీ ట్రైనింగ్​ను మన దేశంలో నిర్వహించాలని జేఈఎంను కోరినట్లు ఆధారాలున్నాయని డీజీపీ అరోరా చెప్పారు.