బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌లో సింధు, శ్రీకాంత్‌‌ బోణీ

బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌లో సింధు, శ్రీకాంత్‌‌ బోణీ
  • సెమీస్‌‌లో లక్ష్యసేన్‌‌
  • వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌

బాలి: ఇండియా స్టార్‌‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌‌.. సీజన్‌‌ ఎండింగ్‌‌ టోర్నీ బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌లో బోణీ కొట్టారు. బుధవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో సింధు 21–14, 21–16తో లైన్‌‌ క్రిస్టోఫర్సెన్​ (డెన్మార్క్‌‌)పై గెలిచింది. 38 నిమిషాల్లోనే  తెలుగు షట్లర్​ మ్యాచ్​ ముగించింది. పవర్​ఫుల్​ సర్వీస్‌‌లు, బలమైన స్మాష్‌‌లతో పాటు నెట్‌‌ వద్ద సూపర్‌‌ డ్రాప్స్‌‌ వేస్తూ వరుస పాయింట్లు రాబట్టింది.  5–2 లీడ్‌‌తో తొలి గేమ్‌‌ స్టార్ట్​ చేసిన  సింధుకు లైన్‌‌ కొద్దిగా పోటీ ఇచ్చింది. చకచకా పాయింట్లు సాధించి 7–6 లీడ్‌‌ను సాధించింది. కానీ వెంటనే తేరుకున్న సింధు... వరుసగా 10 పాయింట్లు నెగ్గి 16–8 లీడ్‌‌ను సాధించింది. ఆ తర్వాత కంఫర్టబుల్‌‌గా గేమ్‌‌ను సొంతం చేసుకుంది. ఎండ్స్‌‌ మారిన తర్వాత లైన్‌‌ కాసేపు బెటర్‌‌ షో చూపెట్టింది. 4–2తో లీడ్‌‌ సాధించినా.. సింధు 11–10తో ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్‌‌ తర్వాత స్మాష్‌‌లతో చెలరేగిన సింధు 17–13 స్కోరుతో ముందుకెళ్లింది. గురువారం యవొనె లీతో సింధు పోటీ పడనుంది. ఇందులో గెలిస్తే సెమీస్​ చేరుతుంది. కాగా, విమెన్స్‌‌ డబుల్స్‌‌ గ్రూప్‌‌–బిలో అశ్విని– -సిక్కి రెడ్డి 14–-21, 18–-21తో నమి మత్సుయమా–-చిహారు షిడా (జపాన్‌‌) చేతిలో ఓడారు.   ఇక, మెన్స్​ సింగిల్స్​ గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో శ్రీకాంత్‌‌ 21–14, 21–16తో వరల్డ్‌‌ 33వ ర్యాంకర్‌‌ తోమ జూనియర్‌‌ పొపోవ్‌‌ (ఫ్రాన్స్‌‌)ను ఓడించాడు. అటాకింగ్‌‌ గేమ్‌‌తో 42 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. స్టార్టింగ్‌‌లో ఇద్దరూ పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడటంతో తొలి గేమ్‌‌ చాలా టైట్‌‌గా నడిచింది. అయినప్పటికీ  శ్రీకాంత్‌‌ 11–9తో బ్రేక్​కు వెళ్లాడు.  ఆ వెంటనే వరుసగా మరో ఐదు పాయింట్లు నెగ్గి లీడ్‌‌ను 16–10కి పెంచుకున్నాడు. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోకుండా గేమ్‌‌ను ముగించేశాడు. సెకండ్‌‌ గేమ్‌‌లో 1–4తో వెనుకబడ్డ తెలుగు కుర్రాడు.. బ్రేక్‌‌ వరకు రెండు పాయింట్ల లీడ్‌‌  సాధించాడు. ఆ తర్వాత సూపర్బ్‌‌ నెట్‌‌ ప్లేతో 14–9, 19–14తో ముందుకెళ్లి ప్రత్యర్థికి చెక్‌‌ పెట్టాడు.  

లక్కీ.. లక్ష్యసేన్​..
ఇండియా యంగ్​ షట్లర్​ లక్ష్యసేన్​కు లక్​ కలిసొచ్చింది. కష్టమైన  గ్రూప్–ఎలో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్​ కూడా కంప్లీట్​ చేయకుండానే తను డైరెక్ట్​గా సెమీస్​ చేరుకున్నాడు. గ్రూప్​ ఫస్ట్‌‌ మ్యాచ్‌‌ తొలి గేమ్​లో  1–1తో ఉన్న టైమ్‌‌లో జపాన్‌‌ టాప్‌‌ ప్లేయర్‌‌ కెంటో మెమోటా.. బ్యాక్‌‌ ఇంజ్యూరీ కారణంగా మ్యాచ్‌‌, టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో లక్ష్యకు వాకోవర్‌‌ విక్టరీ లభించింది. అయితే ఇదే గ్రూప్‌‌లో ఉన్న రాస్మస్‌‌ గెమ్కే (డెన్మార్క్‌‌) కూడా లెగ్‌‌ ఇంజ్యూరీతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో, ఈ గ్రూప్​ నుంచి  లక్ష్యతో పాటు విక్టర్‌‌ అక్సెల్సెన్‌‌ (డెన్మార్క్‌‌) సెమీస్​ బెర్తులు కన్ఫామ్​ అయ్యాయి. కాగా, మెన్స్‌‌ డబుల్స్‌‌లో సాత్విక్​–చిరాగ్‌‌ జోడీ16–21, 5–21తో కిమ్‌‌ అస్ట్రప్‌‌–రాస్ముసెన్‌‌ (డెన్మార్క్‌‌) చేతిలో ఓడిపోయింది.