V6 News

రైల్వే ఎగ్జామ్ కోసం చర్మం తీసి ఫ్రెండ్ వేలికి అతికించి

రైల్వే  ఎగ్జామ్ కోసం చర్మం తీసి ఫ్రెండ్ వేలికి అతికించి

ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సాధించాలన్న ఆశతో ఓ యువకుడు కొత్త మోసానికి పాల్పడ్డాడు. నియామక పరీక్షను తనకు బదులు తన స్నేహితుడితో రాయించాలనుకున్నాడు. ఎగ్జామ్ హాల్ లో బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు విషయం బయటపడకుండా వేలిముద్ర మార్చాడు. అది కాస్తా బెడిసి కొట్టి, చివరికి ఆ ఇద్దరూ కటకటాల పాలయ్యారు. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరలో జరిగింది.

ఈ నెల 22న జరిగిన వడోదరలో రైల్వే నియమాక పరీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో బిహార్‌ ముంగెర్‌ జిల్లాకు చెందిన మనీశ్‌ కుమార్‌ తన స్థానంలో పరీక్ష రాయడానికి స్నేహితుడు రాజ్యగురు గుప్తాను ఒప్పించాడు. ఇందుకోసం ఓ భారీ పన్నాగమే పన్నాడు. అదేంటంటే... మనీశ్‌ వేడి పెనంపై తన బొటనవేలిని పెట్టడంతో పొక్కు లేచింది. ఆ తర్వాత వేలి చర్మాన్ని బ్లేడుతో తొలగించి రాజ్యగురు బొటనవేలిపై అతికించాడు. 

ఇక నియాకమ పరీక్షకు హాజరైన ఆ స్నేహితుడు పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్‌ యంత్రంలో ఎన్నిసార్లు వేలిముద్ర వేసినా అది మ్యాచ్ కాలేదు. దీంతో నిర్వాహకులకు అనుమానం వచ్చింది. అదే సమయంలో అతడు తన బొటనవేలిని ప్యాంటు జేబులో దాచుకోవడం వారి కంటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాజ్యగురు బొటనవేలిపై శానిటైజర్‌ స్ప్రే చేయడంతో అతికించిన చర్మం కాస్తా ఊడి కింద పడింది. ఈ అనూహ్య ఘటనతో అధికారులు కంగుతిన్నారు. అధికారుల ఫిర్యాదు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి... కారకులిద్దరినీ అరెస్టు చేశారు.