రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌‌

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌‌

త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామన్న సీఈవో
రాష్ట్రంతోపాటు ఏపీ, కర్నాటక, తమిళనాడుకు తీరనున్న ఎరువుల కొరత
ఫ్యాక్టరీ రివైవల్‌‌కు ‘కాకా’, వివేక్‌‌ వెంకటస్వామి కృషి

గోదావరిఖని, వెలుగు:రామగుండం ఫెర్టిలైజర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కెమికల్స్ లిమిటెడ్‌‌‌‌ (ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌) ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు నిర్వహించిన ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ సక్సెస్ అయింది. టెక్నాలజీ గ్రేడ్‌‌‌‌ యూరియాను ప్రిల్లింగ్‌‌‌‌ టవర్‌‌‌‌ నుంచి బెల్ట్‌‌‌‌ ద్వారా సైలో బంకర్‌‌‌‌కు, అక్కడి నుంచి బ్యాగింగ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ వరకు తరలించి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇది సక్సెస్ కావడంతో అధికారులు, ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ చేసిన ఆఫీసర్లు, ఎంప్లాయిస్​ను ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ సీఈవో నిర్లిప్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాయ్‌‌‌‌, ప్లాంట్‌‌‌‌ జీఎం వీకే బంగార్‌‌‌‌ అభినందించారు. నిర్లిప్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాయ్‌‌‌‌ మాట్లాడుతూ.. టెక్నాలజీ గ్రేడ్‌‌‌‌ యూరియాతో చేసిన ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ సక్సెస్ అయిందన్నారు. మార్చిలో కమర్షియల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఆఫీసర్లు సోమనాథ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ ధావన్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్‌‌‌‌ ఆధారిత ప్లాంట్‌‌గా‌‌ పునరుద్ధరణ..

బొగ్గుతో నడిచే రామగుండం  ఎరువుల  కర్మాగారాన్ని (ఎఫ్‌‌‌‌సీఐ) నష్టాల కారణంగా 1999లో మూసివేశారు. ఎఫ్‌‌‌‌సీఐ స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్యాస్ ఆధారితంగా ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ నిర్మించారు. 2015 ఫిబ్రవరి 17న ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌ ఏర్పడగా, 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి సెప్టెంబర్ 25న నిర్మాణ పనులు ప్రారంభించారు. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర  మోడీ ఈ ప్లాంట్ కోసం మెదక్ జిల్లా గజ్వేల్ లో శంకుస్థాపన చేశారు.  2018 డిసెంబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఎరువుల ఉత్పత్తి  చేయాలనుకున్నప్పటికీ వర్షాలు, ఇతర కారణాల వల్ల లేటైంది. అలాగే 2020లో ఫ్యాక్టరీని ప్రారంభించాల్సి ఉండగా, కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగవడంతో  నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసి ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ చేశారు.

ఏటా 13 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌ టన్నుల ఉత్పత్తి..

ఈ పరిశ్రమలో కొత్త టెక్నాలజీతో వేపనూనె పూత పూసిన యూరియాను తయారు చేయనున్నారు. ఏటా 13 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయాలనేది ఈ పరిశ్రమ లక్ష్యం. దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్‌‌ టన్నుల యూరియా వాడుతుండగా 240 లక్షల మెట్రిక్‌‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ లోటును తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను రీఓపెన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటగా తెలంగాణలో ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ రెడీ అయింది. ఇక్కడ తయారు చేసే యూరియాలో రాష్ట్రానికి 6.50 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నులు, మిగిలింది ఏపీ, తమిళనాడు, కర్నాటకకు సప్లై చేయనున్నారు.

నిర్మాణ ఖర్చు రూ.6,180  కోట్లు

కేంద్రం రూ.5,920.55  కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ పనులు ప్రారంభించినా.. పనులు పూర్తయ్యే సరికి రూ.6,180  కోట్లకు ఖర్చు పెరిగింది. రూ.3,830 కోట్లు మెషినరీ కొనుగోళ్లకు ఖర్చు చేసింది.  కర్మాగారం  కోసం 560 ఎకరాల స్థలాన్ని  కేటాయించగా,  సగం స్థలంలో ప్రధాన ప్లాంట్ నిర్మించారు.  రోజుకు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయనున్నారు.

ఆరుగురు వాటాదారులు..

ఆర్‌‌ఎఫ్‌సీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు తెలంగాణ సర్కార్ వాటాదారుగా ఉంది. 26% నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), 26% ఇంజినీర్స్ ఇండియా లిమిడెట్(ఈఐఎల్), 11% ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎఫ్‌‌సీఐఎల్), 11% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 11.7% డెన్మార్క్ దేశానికి చెందిన హల్దార్‌‌‌‌ టాప్స్‌‌‌‌ కంపెనీ, 14.3% గ్యాస్‌‌‌‌ సరఫరా చేసే గెయిల్ సంస్థకు వాటాలున్నాయి. 6 బ్యాంకులు లోన్‌‌‌‌ ఇస్తుండగా, వీటన్నింటికీ ఎస్‌బీఐ నోడల్ ఏజన్సీగా ఉంది.

కొత్త టెక్నాలజీ పరికరాలు

విదేశీ సాంకేతిక సహకారంతో రూపుదిద్దుకుంటున్న ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో అమ్మోనియా ప్లాంట్ టెక్నాలజీని డెన్మార్క్ దేశానికి చెందిన హల్దర్ టాప్స్‌‌‌‌ కంపెనీ, యూరియా ప్లాంట్ టెక్నాలజీని ఇటలీకి చెందిన సైఫమ్ అనే సంస్థ సమకూర్చింది. ఇందులో 373 రకాల యంత్ర పరికరాలను ఆయా దేశాల నుంచి తెప్పించారు. వీటితో పాటు దేశంలోని ముంబై, పుణె, కోల్‌కతా, బెంగళూర్, తదితర ప్రాంతాలలో కూడా యంత్రాలను తయారు చేయించారు. గంటకు 24 వేల క్యూబిక్ మీటర్ల సామర్ధ్యం గల కూలింగ్‌‌‌‌ టవర్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌, కంప్రెస్ ఎయిర్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌, రా వాటర్, గ్యాస్ సిస్టమ్ ఉన్నాయి. డీఎం వాటర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ నిర్మాణం, అమ్మోనియా ట్యాంకులు, 220 కేవీ స్విచ్ యార్డులు, నైట్రోజన్ ప్లాంట్, ఎరువును నింపే బ్యాగింగ్ ప్లాంట్ నిర్మించారు. యూరియా  తయారీలో  కీలకమైన ఫ్రిల్లింగ్ టవర్‌‌ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వేస్ట్ గ్యాస్ మండించేందుకు 60 మీటర్ల ఎత్తులో ప్లేర్‌‌‌‌ స్టిక్‌‌‌‌ నిర్మించారు. అలాగే  ఎరువుల ఉత్పత్తికి అవసరమయ్యే 32.5 మెగావాట్ల క్యాప్టివ్ పవర్‌‌ ప్లాంట్‌‌‌‌ను హైదరాబాద్ బీహెచ్ఈఎల్ సంస్థ రూ.233 కోట్లతో నిర్మించింది.

అవసరమైన నీరు ఎల్లంపల్లి  నుంచి..

ఫ్యాక్టరీకి అవసరమైన 0.55  టీఎంసీల నీటిని రాష్ట్ర ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కేటాయించింది.  ప్రతిరోజు 40.8 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేయనున్నారు. 27 కి.మీ పైప్‌ లైన్ పనులు చేపట్టారు. రాజీవ్ రహదారిపై ఎన్టీపీసీ నుంచి ఆర్‌‌ఎఫ్‌సీఎల్ వరకు రూ.13.7 కోట్లతో 4 లేన్ల రోడ్డు నిర్మించారు.

365 కిలోమీటర్ల  దూరం నుంచి  గ్యాస్

రోజుకు 2.2 మిలియన్ మెట్రిక్‌‌‌‌ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్(ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్‌‌‌‌ వినియోగించనున్నారు. గుజరాత్ కు చెందిన జీఎస్‌‌‌‌పీఎల్ ఇండియా ట్రాన్స్ కో  లిమిటెడ్ (జీఐటీఎల్)తో 2016 జులై 8న ఒప్పందం కుదుర్చుకున్నారు. కేజీ బేసిన్ లోని తూర్పు గోదావరి జిల్లా  మల్లవరం సమీపంలోని కూచనపల్లి నుంచి 365  కి.మీ దూరం ఉన్న ఆర్‌‌ఎఫ్‌సీఎల్‌కు గ్యాస్ సరఫరా చేసేందుకు భద్రాద్రి  కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలో 15 చోట్ల కంట్రోల్ రూమ్‌లు నిర్మించారు. మల్లవరం నుంచి విజయవాడ మీదుగా గుజరాత్‌కు గ్యాస్ తరలించే క్రమంలో మంథని సమీపంలోని గుమ్మునూర్ వద్ద గల పాయింట్ నుంచి 25 కి.మీల దూరంలోని ఆర్‌‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌కు 2019 అక్టోబర్‌‌‌‌ నుంచి గ్యాస్  సరఫరా  చేస్తున్నారు.

ఫ్యాక్టరీ రివైవల్‌‌‌‌కుకాకా‘,  వివేక్‌‌‌‌ ఎనలేని కృషి

రామగుండంలో 1999లో మూసివేసిన ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు కాకా వెంకటస్వామి, ఆయన కుమారుడు జి.వివేక్‌‌ వెంకటస్వామి ఎనలేని కృషి చేశారు. ఎరువుల కర్మాగారం ప్రారంభమైతే తెలంగాణకు యూరియా కొరత తీరుతుందని మొదటి నుంచి వీరు భావించి అందుకనుగుణంగా పనిచేశారు. 2004లో పెద్దపల్లి  ఎంపీగా ఎన్నికైన తర్వాత జి.వెంకటస్వామి ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌ను నేరుగా కలిసి మాట్లాడారు. దీంతో ఫ్యాక్టరీని రీ ఓపెన్‌‌‌‌ చేయాలని కేంద్ర క్యాబినెట్‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా కాకా తర్వాత ఆ బాధ్యతను ఆయన కుమారుడు వివేక్‌‌‌‌ భుజానికెత్తుకున్నారు. బీఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ (ఖాయిలా పడిన పరిశ్రమల జాబితా)లోకి వెళ్లిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆ జాబితా నుంచి తొలగించేందుకు విశేష కృషి చేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌ సభ్యుడిగా సంబంధిత అధికారులతో నిత్యం మాట్లాడడంతో పాటు లేఖలు రాశారు. అలాగే ప్రధాని మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌తో మాట్లాడి ఫ్యాక్టరీకి ఉన్న  రూ.10 వేల కోట్ల బకాయిలను మాఫీ చేసేలా ఒప్పించి దానిని అమలు చేయించారు. దీంతో మూసివేసిన రామగుండం ఎరువుల కర్మాగారం నేడు గ్యాస్‌‌‌‌ ఆధారితంగా తిరిగి ప్రారంభానికి నోచుకున్నది.

చాలా  సంతోషంగా  ఉంది..

మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని  రూ.6,180 కోట్లతో  మోడీ ప్రభుత్వం రీఓపెన్ చేసింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాకా వెంకటస్వామి, ఎంపీగా నేను చేసిన కృషికి త్వరలోనే ప్రతిఫలం దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది. మోడీ చేతుల మీదుగా ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

‒ వివేక్‌‌‌‌ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌

నాడు స్వస్తిక్… నేడు కిసాన్ 

ఆర్‌‌ఎఫ్‌సీఎల్ కర్మాగారంలో ఉత్పత్తి  చేసే ఎరువులను ‘స్వస్తిక్‌ యూరియా’ పేరుతో గతంలో మార్కెటింగ్‌ చేసేవారు.  ఇప్పుడు ‘కిసాన్ యూరియా’ పేరుతో మార్కెట్‌లోకి  విడుదల చేయాలని  నిర్ణయించారు. ఈ ఎరువుల మార్కెటింగ్ నేషనల్ ఫెర్టిలైజర్స్  లిమిటెడ్  చేపట్టనున్నది. రోజు 500 లారీలు నడిచేందుకు వీలుగా ప్లాంట్ నుంచి గౌతమీనగర్ వరకు ప్రత్యేక రోడ్డు, వ్యాగన్లు నడిచేందుకు మూడో రైల్వే లైన్  నిర్మించారు.