కాకతీయుల ఉత్సవాల పేరిట 50 లక్షలు ఖర్చు చేసినా..

కాకతీయుల ఉత్సవాల పేరిట 50 లక్షలు ఖర్చు చేసినా..
  • పిచ్చి మొక్కల మధ్యనే రాతి స్తంభాలు
  • అనుబంధ ఆలయాలు కూడా శిథిలావస్థలోనే
  • యునెస్కో గుర్తింపు వచ్చి ఏడాదైనా పట్టించుకోని సర్కార్​

రామప్ప టెంపుల్​కు యునెస్కో గుర్తింపు వచ్చి ఏడాది అవుతున్నా.. అక్కడి పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. అపురూపమైన శిల్పాలు, స్తంభాలు పిచ్చిమొక్కల మధ్య మురికి కూపంలోనే పడి ఉన్నాయి. ప్రధాన ఆలయం గోడలు పాకురు పట్టి నల్లగా మారిపోయాయి.  ఆలయ ప్రాంగణంలో ఉన్న కాటేశ్వర, కామేశ్వర, త్రికూట ఆలయాలు, రామప్ప సరస్సు వద్ద కట్టపై ఉన్న శివాలయం, త్రిపూరాలయాలు అన్నీ  కూలడానికి సిద్ధంగా  ఉన్నాయి. కూలిపోయిన ప్రహరీకి కనీసం మరమ్మతులు చేసే దిక్కు లేదు. టెంపుల్​ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు చిల్లి గవ్వ  కూడా ఇవ్వడం లేదు. 

 జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు:  రామప్ప ఆలయ అభివృద్ధి మాట అటుంచితే పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ప్రధాన ఆలయం సహా అనుబంధ ఆలయాలకు రిపేర్లు చేయలేదు. అపురూపమైన శిల్పాలు, స్తంభాలు పిచ్చి మొక్కల మధ్య, మురికి కూపంలో పడి ఉన్నాయి. కనీసం ఆ శిల్పాలను  ఇంచు కూడా  పక్కకు జరపలేదు. రామప్ప ఆలయం ఉత్తరం వైపు కూలిపోయిన ప్రహరీకి మరమ్మతులు కూడా చేయలేదు. ఆలయానికి తూర్పు వైపు నుంచి భక్తులు రావడానికి రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రోడ్డు పెద్ద గండి పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

నిరుడు జులై 25న రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు రావడంతో రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలంతా గర్వపడ్డారు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ రూపురేఖలు ఇకనైనా మారుతాయని , పెద్దసంఖ్యలో టూరిస్టులు వస్తారని, తమ ప్రాంతం పర్యాటకంగా డెవలప్​అవుతుందని స్థానికులు ఆశించారు. కానీ యునెస్కో గుర్తింపు వచ్చి ఏడాది అవుతున్నా  రామప్పకు రాష్ట్ర సర్కారు చిల్లి గవ్వ ఇవ్వలేదు. కాకతీయ ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ఇటీవల రూ.50 లక్షలు ఖర్చు పెట్టి నాటి రాజులను తీసుకొచ్చి గుర్రాలపై ఊరేగించింది. కానీ అదే కాకతీయ చక్రవర్తులు నిర్మించిన,  యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్​కు మాత్రం నిధులు కేటాయించ లేదు.  
ఎట్లున్నయి గట్లనే..  
యునెస్కో గుర్తింపు వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ‘వెలుగు’ టీమ్​ బుధవారం రామప్పను సందర్శించింది. గుర్తింపు వచ్చిన తొలిరోజు ఆలయం, దాని పరిసరాలు ఎట్లున్నయో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. పాకురుపట్టి నల్లగా మారిన ప్రధాన ఆలయం గోడలు, బురదలో పడి వన్నె కోల్పోతున్న నల్లరాతి శిల్పాలు,  పిచ్చిమొక్కల మధ్య రాతి స్తంభాలు, కూలిపోయేందుకు సిద్ధమైన అనుబంధ ఆలయాలు, పాడుబడ్డ ప్రహరీ గోడలు, అర్ధంతరంగా ఆగిపోయిన అంతర్గత రోడ్లు కనిపిస్తున్నాయి. వాస్తవానికి రామప్ప ప్రధాన ఆలయానికి అనుబంధంగా కాకతీయులు 20 గుడులను నిర్మించారు.

ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న కాటేశ్వర, కామేశ్వర, త్రికూట ఆలయాలు, రామప్ప సరస్సు వద్ద కట్టపై ఉన్న శివాలయం, త్రిపూరాలయాలు అన్నీ  కూలడానికి సిద్ధంగా  ఉన్నాయి. ఇవన్నీ ఇసుక పునాదులపై నిర్మించినవే. కాటేశ్వర ఆలయాన్ని బాగు చేస్తామని విప్పి కుప్పపెట్టారు. పునాదుల నుంచి బయటికొచ్చిన 800 ఏళ్ల నాటి ఇసుక ప్రస్తుత వర్షాలు, వరదల్లో కొట్టుకుపోతోంది. త్రికూట ఆలయం మట్టిలోనే కూడుకపోగా శిల్పాలను బయట తీసిపెట్టారు. మొన్నటిదాకా పూజలందుకున్న సరస్సు దగ్గర గల శివాలయం, కల్యాణ మండపం చెట్ల వేర్ల వల్ల పూర్తిగా దెబ్బతిన్నది. హరిత కాకతీయ రిసార్ట్స్‌‌‌‌ దగ్గర ఉన్న త్రిపురాలయం పిచ్చిమొక్కల మధ్య అలాగే ఉంది. టెంపుల్‌‌‌‌కు ఉత్తర దిశలో ఉన్న  శివాలయం మందుబాబులకు అడ్డాగా మారింది. 
హుండీ ఆదాయం రాష్ట్ర ఖజానాకు
రామప్ప ఆలయ హుండీ ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరుతోంది. వివిధ పూజల రసీదులపై వచ్చే ఇన్​కం కూడా కలిపితే ఏడాదికి సుమారు రూ.15 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగూ ఈ ఆలయం గురించి రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు. కనీసం యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాతైనా కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో గడిచిన ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.45 కోట్లతో గార్డెనింగ్, టాయిలెట్​ఫెసిలిటీ, టెంపుల్​ విశేషాలను తెలుసుకునేలా బోర్డుల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేసింది. ఇదే లెక్కన రాష్ట్ర సర్కార్​ కూడా నిధులు విడుదల చేసుంటే రామప్ప పరిస్థితి కొంతైనా మారి ఉండేది. రూ.5 కోట్లతో రామప్ప సరస్సు మధ్యలో ఉన్న 15, 20 ఎకరాల ఐలాండ్​లో ధ్యాన మందిరం, కోటిలింగాల గుడితో పాటు తదితరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చి ఒక్కటి కూడా నెరవేరలేదు. యునెస్కో గుర్తింపుతో రామప్ప దశ తిరుగుతుందనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది.

మురికి నీళ్లల్లోనే అపురూప శిల్పాలు 
రామప్ప టెంపుల్‌‌‌‌ తూర్పు ముఖద్వారం (ప్రాకారం) 2012లో కూలిపోగా 2017 ఆగస్టులో పడిన వర్షాలకు ప్రహరీ పడిపోయింది. కోర్టు సుమోటో కేసుగా తీసుకొని మొట్టికాయలు వేయడంతో ఆఫీసర్లు ఏదో కొద్దిగా పనులు చేసినట్లు చేసి చేతులు దులుపుకున్నారు. కామేశ్వరం ఆలయం పునర్నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ఆలయానికి సంబంధించిన శిల్పాలను, రాతిస్తంభాలను నేలపై పరిచిపెట్టారు. 8 ఏండ్లుగా ఎవరూ పట్టించుకోక పోవడంతో ఈ శిల్పాల చుట్టూ మురికినీరు వచ్చి చేరింది. రాతితో ఒక్క శిల్పం తయారు చేయాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుంది. అలాంటిది రూ.కోట్ల విలువచేసే శిల్పాలు మట్టిపాలవుతున్నా పట్టించుకునే వారు లేరు.