హాకీ స్టిక్ కొనలేని స్థాయి నుంచి.. భారత్‌ను సెమీస్‌కు..

హాకీ స్టిక్ కొనలేని స్థాయి నుంచి.. భారత్‌ను సెమీస్‌కు..

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు అదరగొడుతున్నాయి. ఇటు పురుషలు జట్టు 41 ఏళ్ల తర్వాత సెమీ ఫైనల్స్‌కు చేరుకోగా.. అటు మహిళలు కూడా తొలిసారిగా టాప్ 4లో టీమ్స్‌లో ఒకటిగా నిలిచారు. ముఖ్యంగా పెద్దగా అంచనాలు లేని ఇండియా విమెన్స్ టీమ్ సెమీస్‌కు చేరుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే దీని వెనుక ఆటగాళ్లు, కోచ్‌ల కృషి ఉంది. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్, కెప్టెన్ రాణి రాంపాల్ జట్టును అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవాలనే కోరికతో ఆడుతున్న రాణి రాంపాల్.. తమకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలు, కుటుంబీకులు, కోచ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈసారి గోల్డ్ పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. అలాంటి రాణి రాంపాల్ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

వర్షం కురిస్తే ఇల్లు మునిగేది
రాణి రాంపాల్‌కు హాకీ అంటే చాలా ఇష్టం. ఆ గేమ్‌ నేర్చుకోవాలని, అందులో మంచి ప్రతిభ చూపాలని ఆమెకు కోరికగా ఉండేది. అయితే ఆట నేర్చుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో హాకీ స్టిక్ కొనడానికి కూడా రాణి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. హాకీ స్టిక్ కొనడానికి డబ్బుల్లేని స్థితిలో ఆమె కుటుంబం ఉండేది. దీని గురించి రాణి రాంపాల్ మాట్లాడుతూ.. ‘నేను నా జీవితం నుంచి తప్పించుకోవాలని అనుకున్నాను. ఇంట్లో కరెంట్ సరిగ్గా ఉండేది కాదు. మేం నిద్రించే సమయంలో దోమలు మా చెవుల దగ్గర శబ్దాలు చేస్తూ ఉండేవి. వర్షం పడినప్పుడు మా ఇల్లు మునిగిపోయేది’ అని ఓ ఇంటర్వ్యూలో రాణి పేర్కొంది. దీన్ని బట్టి ఆమె కుటంబం దీనావస్థను అర్థం చేసుకోవచ్చు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన రాణి.. ఈస్థాయికి ఎదిగిందంటే ఆమె పోరాటం, ప్రయాణం ఎంత గొప్పగా సాగి ఉంటాయో ఊహించుకోవచ్చు. 

పోషకాహార లోపం.. రిజెక్ట్ చేసిన కోచ్
రాణి రాంపాల్ తండ్రి రిక్షా నడిపేవారు. ఆమె తల్లి ఓ ఇంట్లో పని మనిషిగా ఉండేవారు. వీరి ఇంటికి దగ్గర్లో ఓ హాకీ అకాడమీ ఉండేది. అక్కడ ఆడుతున్న జట్లు, ఆటగాళ్లు ఆడేతీరును గంటల తరబడి చూస్తూ, గమనిస్తూ ఉండేది రాణి. ఆ అకాడమీలో తనను చేర్పించాల్సిందిగా పేరెంట్స్‌ను ఆమె అడుగుతుండేది. అయితే రోజుకు రూ.80 సంపాదించే రాణి తండ్రికి హాకీ స్టిక్‌ను కొనిచ్చే స్థోమత లేదు. ఈ విషయం గురించి రాణి స్పందిస్తూ.. ‘ప్రతి రోజు మా ఇంటి దగ్గర్లోని అకాడమీ కోచ్‌ను నాకు ట్రెయినింగ్ ఇవ్వమని అడిగేదాన్ని. కానీ ఆయన నేను బలంగా లేనని, పోషకాహార లోపంతో ఉన్నానని రిజెక్ట్ చేసేవారు. నా కోసం పావు లీటరు పాలు కొనివ్వని స్థితిలో మా ఫ్యామిలీ ఉండేది. అందుకే ఎవరికీ చెప్పకుండా పాలలో నీళ్లు కలిపి తాగేదాన్ని. ఆ తర్వాత ఆటకు వెళ్లేదాన్ని’ అని రాణి పేర్కొంది. 

విరిగిన స్టిక్‌తో ప్రాక్టీస్ 
కొత్త హాకీ స్టిక్ కొనడం కుదరదని అర్థం కావడంతో గ్రౌండ్‌లో దొరికిన విరిగిన స్టిక్‌తో రాణి రాంపాల్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. సొంతంగా సాధన చేసేది. ఆ తర్వాత ఎట్టకేలకు ఆమెకు ఓ అవకాశం ఇవ్వడానికి కోచ్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత రాణిలో టాలెంట్‌ను గుర్తించి ఆమెకు కొత్త హాకీ స్టిక్స్, షూస్, కిట్ కోచ్ కొనిచ్చారు. ఆమెకు మంచి డైట్‌ను కూడా అందించేవారు. గేమ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత నెగ్గిన ఓ టోర్నమెంట్‌లో రాణికి రూ.500 ప్రైజ్‌మనీ వచ్చింది. ఆ డబ్బులను ఆమె తన తండ్రికి ఇచ్చింది. ఇలా ఆడుతూ స్టేట్ చాంపియన్‌షిప్స్‌లో అదరగొట్టింది. ఆ తర్వాత నేషనల్ జట్టుకు సెలెక్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఇక, గోల్డ్ గెలవాలన్న కలే తరువాయి. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే భారత్‌కు బంగారు పతకాన్ని అందివ్వాలన్న రాణి కోరిక నెరవేరుతుంది. దేశ ప్రజలు, క్రీడాభిమానులు కోరుకునేది కూడా అదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.