V6 News

లాన్స్‌‌ నాయక్ చంద్రశేఖర్ అవశేషాలు లభ్యం

లాన్స్‌‌ నాయక్ చంద్రశేఖర్ అవశేషాలు లభ్యం

సియాచిన్‌‌లో 16 వేల అడుగుల ఎత్తులో గుర్తింపు

లడఖ్: సియాచిన్ హీరో ఆయన.. 1984లో జరిగిన ‘ఆపరేషన్ మేఘదూత్’ సందర్భంగా ప్రమాదంలో చిక్కుకుని వీర మరణం పొందారు. కానీ ఆచూకీ తెలియలేదు.. ఏండ్లు గడిచాయి. ఇప్పుడు.. 38 ఏండ్ల తర్వాత లాన్స్ నాయక్ చంద్రశేఖర్ అవశేషాలు లభించాయి. 75 ఏండ్ల స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులను స్మరించుకుంటున్న సమయంలో చంద్రశేఖర్ జాడ తెలియడంతో ఉత్తరాఖండ్‌‌కు చెందిన ఆయన ఫ్యామిలీ నిరీక్షణకు తెరపడింది.

ఓల్డ్ బంకర్ వద్ద..

ఉత్తరాఖండ్‌‌లోని హల్ద్వానీకి చెందిన చంద్రశేఖర్.. ఆర్మీలోని 19 కుమావ్ రెజిమెంట్‌‌లో డ్యూటీ చేసే వారు. ఈ రెజిమెంట్‌‌లోని ఓ బృందానికి సియాచిన్‌‌లోని ‘పాయింట్ 5965’ని స్వాధీనం చేసుకునే పని అప్పజెప్పారు. ఇది పాకిస్తానీలు కన్నేసిన ముఖ్యమైన ఏరియా. 1984 మే 29న సియాచిన్ గ్లేసియర్‌‌‌‌ను ఇండియా అధీనంలోకి తెచ్చుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ మేఘదూత్‌‌లో ఇది మొదటి అడుగు. తమ టాస్క్‌‌ను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగిన సైనికులకు దారి మధ్యలో అనుకోని అవాంతరం ఎదురైంది. రాత్రి రెస్ట్ తీసుకుంటుండగా.. హిమపాతం ముంచెత్తడంతో 18 మంది సోల్జర్లు అందులో చిక్కుకున్నారు. సెకండ్ లెఫ్టినెంట్ పీఎస్ పుండిర్ సహా అందరూ చనిపోయారు. 14 మంది డెడ్‌‌బాడీలు తర్వాత దొరికాయి. కానీ మిగిలిన వారి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఇన్నేండ్ల తర్వాత 13న సియాచిన్‌‌ గ్లేసియర్ ఓల్డ్ బంకర్‌‌‌‌లో 16 వేల అడుగుల ఎత్తున ఓ సోల్జర్ అవశేషాలు దొరికాయి. అక్కడ ఆర్మీ నంబర్‌‌‌‌తో కూడిన డిస్క్ బయటపడింది. దాని ద్వారా ఆ అవశేషాలు లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌‌‌‌విగా గుర్తించారు.