డబుల్ బెడ్రూం ఇండ్ల కూల్చివేతలో ఆందోళన

డబుల్ బెడ్రూం ఇండ్ల కూల్చివేతలో ఆందోళన
  • ఇండ్లను కూలగొట్టరంటూ పోలీసులకు, కాలనీ వాసులకు మధ్య గొడవ
  • ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
  • లబ్ధిదారులకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఆందోళన
  • కాలనీ వాసులకు అండగా ఉంటాం: మంత్రి తలసాని

ఖైరతాబాద్, వెలుగు:  జూబ్లీహిల్స్ లోని అంబేద్కర్ నగర్ బస్తీలో లబ్ధిదారులు నిర్మించుకుంటోన్న డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో  బస్తీ వాసులు ఆందోళన చేశారు.  రెవెన్యూ అధికారులు, పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్తీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.46 అంబేద్కర్ నగర్ బస్తీలోని రెండెకరాల ప్రభుత్వ స్థలంలో 25 ఏండ్లుగా కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. 2015లో అప్పటి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి  ఇక్కడ డబుల్ బెడ్రూంలు కట్టాలని ప్రతిపాదించారు. మొదట బస్తీ వాసులు వ్యతిరేకించారు. తామే ఇండ్ల నిర్మాణం చేసుకుంటామన్నారు. చివరకు అధికారుల హామీతో డబుల్ బెడ్రూం  ఇండ్ల నిర్మాణానికి బస్తీ వాసులు అంగీకరించారు. ఈ మేరకు 152 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి పొజిషన్ సర్టిఫికెట్ అందజేశారు. తాత్కాలికంగా గుడిసెలను ఓ పక్కకు వేసుకునేలా అవకాశం కల్పించారు.  3 బ్లాకు ల్లో డబుల్ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.  మొదటి బ్లాక్ స్లాబ్ లు మాత్రం పూర్తి చేశారు. ఇంకా 70 శాతం పని మిగిలే ఉంది. మిగతా బ్లాక్ ల నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు. బస్తీ వాసులు ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసినా పనులు జరగలేదు. దీంతో తమకు కేటాయించిన స్థలాల్లో తామే ఇండ్లు నిర్మించుకోవాలని బస్తీ వాసులు భావించారు. ఇటీల నిర్మాణ పనులను ఓ వ్యక్తికి అప్పగించారు. దీని గురించి తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేశారు.కానీ బస్తీ వాసులు మళ్లీ 5 తాత్కాలిక నిర్మాణాలను మొదలుపెట్టారు. తహసీల్దార్ రామకృష్ణ తన సిబ్బందితో పాటు జూబ్లీహిల్స్ పోలీసుల సాయంతో శుక్రవారం ఉదయం కూల్చివేతలు మొదలుపెట్టారు. సిబ్బంది బుల్ డోజర్ తో రెండు నిర్మాణాలను కూల్చివేయడంతో బస్తీవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ కూల్చివేతలు ఆపకపోవడంతో  రెవెన్యూ, పోలీసుల సిబ్బందితో రాళ్లతో దాడులకు దిగారు. రాళ్ల దాడిలో ఓ మహిళా ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బస్తీ వాసులకు మద్దతుగా ఆందోళన చేశారు.

అధికారి తప్పిదం కారణంగానే..

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నం.46 అంబేద్కర్ నగర్ లో జరిగిన ఘటన బాధాకరమని, ఒక అధికారి చేసిన తప్పిదం కారణంగా ఈ ఘటన జరిగిందని ఆయన  వివరణ ఇచ్చారు. మాసబ్ ట్యాంక్ లోని ఆయన ఆఫీసులో  ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులతో కలిసి ఈ ఘటనపై తలసాని సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు పేదల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కాలనీ వాసులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, జీవో 58 కింద అక్కడ ఉంటున్న వారి స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. వారం రోజుల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ నగర్ లో పర్యటిస్తామన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, వారితో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు.