పురుగు పడుతున్న దొడ్డు బియ్యం..ఏడాది నుంచి గోడౌన్లలోనే బియ్యం 

పురుగు పడుతున్న దొడ్డు బియ్యం..ఏడాది నుంచి గోడౌన్లలోనే బియ్యం 
  • కిలోకు రూ. 12 తగ్గించినా.. కొనడానికి ఎవరూ రాలే
  • కిలో రూ. 36 విలువైన బియ్యం రూ. 24కు వేలం
  • ఎవరూ బిడ్లు​ వేయలే
  • యాదాద్రిలో 1302 టన్నుల దొడ్డు బియ్యం

యాదాద్రి, వెలుగు:   ఎట్లున్న దొడ్డు బియ్యం అట్లనే ఉన్నాయి. తక్కువ రేటుకు వేలం వేసినా ఎవరూ బిడ్లు దాఖలు చేయడం లేదు. దాదాపు ఏడాదిగా అట్లనే ఉండడంతో వాటికి పురుగు పడుతోంది. బియ్యం తూకంలో తరుగు ఏర్పడుతోంది. దీంతో దొడ్డు బియ్యం నిల్వలపై రేషన్​ డీలర్లతో పాటు సివిల్ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ఆందోళన చెందుతోంది. 

ఏడాదిగా అట్లనే

రేషన్​ కార్డుదారులకు గతేడాది మార్చి వరకూ దొడ్డు బియ్యం పంపిణీ జరిగింది. ఏప్రిల్​ 2025 నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ వద్ద 1302 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు మిగిలిపోయాయి. దాదాపు ఏడాదిగా నిల్వలు అలానే ఉండడంతో బియ్యానికి పురుగు పడుతోంది. దీంతో పాటు బియ్యం ముక్కిపోయి వాసన వస్తున్నాయి. కాగా స్థలం కొరత కారణంగా ప్రతి నెల వస్తున్న సన్న బియ్యం కూడా దొడ్డు బియ్యం పక్కనే నిల్వ చేస్తున్నారు. దీంతో సన్న బియ్యానికి పురుగు పుడుతోందని డీలర్లు అంటున్నారు. తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వలు తరలించాలని కోరుతున్నా.. హయ్యర్​ ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

తక్కువ రేటుకే వేలం వేసినా..

జిల్లాలోని ఎంఎల్​ఎస్​ పాయింట్లలో 181 టన్నులు, బఫర్​ గోడౌన్​లో 348 టన్నులు, రేషన్​ షాపుల్లో 774 టన్నులు కలుపుకొని మొత్తంగా 1302 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు అలానే ఉండిపోయాయి. రైతుల నుంచి వడ్ల కొనుగోలు, ట్రాన్స్​పోర్ట్​తో పాటు మరాడించిన చార్జీలు కలుపుకుంటే.. కిలో బియ్యానికి రూ. 36 అవుతోంది. ఈ లెక్కన  13020 క్వింటాళ్ల బియ్యానికి రూ. 4.70 కోట్ల విలువ ఉంటోంది. అయితే పది నెలలుగా బియ్యం నిల్వలు అలానే ఉండడంతో కిలో బియ్యం రూ. 24 చొప్పున అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన రూ. 3.12 కోట్లు మాత్రమే రాబడి ఉంటుంది. మొత్తంగా రూ. 1.58 కోట్ల నష్టం వాటిల్లుతున్నా.. బియ్యం వేలం వేశారు.  స్టేట్​ లెవల్లోని దొడ్డు బియ్యం నిల్వలను ఒకే లాట్​గా పేర్కొంటూ ‘జెమ్​ పోర్టల్’  ద్వారా గ్లోబల్​ టెండర్లు పిలిచారు. అయితే గడువు ముగిసినా ఏ ఒక్కరూ బిడ్లు దాఖలు 
చేయలేదు. 

టెండర్​పై మళ్లీ కసరత్తు.?

 టెండర్లు పిలవడానికి మరోసారి కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మొదటిసారి కిలో రూ. 24 చొప్పున పిలిచిన గ్లోబల్​ టెండర్లకు రెస్పాన్స్​ రాకపోవడంతో మరోసారి పిలిచేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి మరింత ధర తగ్గిస్తారా..? గతంలో మాదిరిగా ఒకే లాట్​గా కాకుండా విడివిడిగా టెండర్​ పిలుస్తారా.. అనేది తేలనుంది.

తరుగుపై డీలర్ల ఆందోళన 

పది నెలలుగా బియ్యం నిల్వలు అలానే ఉన్నాయి. బియ్యానికి పురుగు పడుతోంది. ఈ పురుగు పక్కనే నిల్వ చేసిన సన్న బియ్యం స్టాక్స్​కు అంటుకుంటోంది. బియ్యానికి తెల్ల పురుగు పడుతోంది. ఈ పురుగు బియ్యం లోనికి వెళ్లి డొల్ల చేస్తుంది. ఈ కారణంగా బియ్యం బరువు తగ్గిపోయి తరుగు ఏర్పడుతుంది.

సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ మాత్రం ఆరు నెలలు గోదాముల్లో ఉంటే కిలో బియ్యానికి 0.5 తరుగు అంగీకరిస్తుంది. ఈ అవకాశం రేషన్​ డీలర్లకు మాత్రం లేదని ఆఫీసర్లు అంటున్నారు. దీంతో పది నెలలుగా తమ వద్దే స్టాక్​ ఉంటున్న బియ్యం తరుగు వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని డీలర్లు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.